పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0242-01 సాళంగనాట సం: 03-2౩9 నృసింహ

పల్లవి:

శరణని బ్రదుకరో జనులాల
గరిమ మెరసె నిదె కనకసింహము

చ. 1:

అహరహమునుఁ బ్రహ్లాదుఁడు దొరకొని
బహువిధముల హరిమహిమలు వొగడఁగ
కహకహ హిరణ్యకసిపుఁడు నగి హరి
సహజ మేదియని చఱచెఁ గంభము

చ. 2:

అటమరి పెటపెటమని బేంట్లెగసి
చిటచిటరవములఁ జిరుతపొగ లెగసి
తటతట మనుచును తరలి వ్రయ్యలై
పటపటమనుచును పగిలెఁ గంభము

చ. 3:

బెడిదపు చూపుల మిడుఁగురు లెగయఁగ
పుడమి యదర నూర్పులు చెలఁగ
గడగడ వడఁకి దిక్తటము లల్లాడఁగ
వెడలెఁ గంభమున విజయసింహము

చ. 4:

నగవుల సుడివడె నభోంతరంబులు
పొగ లెగసెను పెనుబొమముళ్ళ
పగటు నార్పులను పగిలెనుఁ గొండలు
వెగటుగ వెడలెను వీరసింహము

చ. 5:

తెఱచిన నోరఁ బ్రతిధ్వను లెసగఁగ
కఱకుగతుల చుక్కలు చెదర
నెఱి హుంకృతులను నిఖిలము బెదరఁగ
వెఱచఱవఁ గెరలె విమలసింహము

చ. 6:

పటువిహారముల బ్రహ్మాండ మగల
గుటగుటరవళి నాకులు వొగడ
నిటలనేత్రమున నెఱమంట లడర
పటుగతి మెరసెను భయదసింహము

చ. 7:

పెదపెదకోఱల పిడుగులు రాలఁగ
తుదనఖముల నెత్తురు దొరుగ
గుదిగొను కసరుల కులగిరు లూఁటాడ
వుదయించె నదివో వుగ్రసింహము

చ. 8:

అట్టహాసమున నసురలు వారఁగ
ముట్టి వాయువులు మొగతిరుగ
దట్టములై జలధరములు ముసరఁగ
దిట్టయై వెడలె ధీరసింహము