పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0224-05 దేవగాంధారి సం: 03-136 పోలికలు

ధర్మాధర్మము లాల దైవము లాల
నిర్మిత మాతఁడే కాని నే నేమీ నెఱఁగ

చ. 1:

పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను
నెట్టన నున్న పనులు నే నెఱఁగ
వెట్టివాఁడ నేనింతే విష్ణుఁడు నా కేలికె
చుట్టిన నడుమంత్రాల సుద్దులూ నెఱఁగ

చ. 2:

లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను
చేకొని కర్మములలో చేఁతలెరఁగ
సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుఁడాతఁడు
దాకొని నేఁ దలఁచేటి తలఁపూ నెఱఁగ

చ. 3:

అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ
పంతాన నాలోపలి భావ మెరఁగ
యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటివాఁడ నేను
చెంతల నానందమిది చెప్పనేమీ నెఱఁగ