పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-02 బౌళి సం: 03-103 శరణాగతి

పల్లవి:

అవాప్తసకలకాముఁ డనుమాట నీకుఁ జెల్లె
వివేకించఁ బురుషార్థవిధి మా యందేది

చ. 1:

మరిగి నీపై భక్తి మాకుఁ గలుగుటెల్లాను
అరసి నీవు రక్షించే ఆసకొరకే
హరి నీవు భక్తవాత్సల్యము మాపై జేయుటెల్ల
ఇరవైన నీకు నిరుహేతుకమే

చ. 2:

కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను
వెస మా భారము నీపై వేయుకొరకే
వసముగా నీవు నన్ను వలెనని యేలుటెల్ల
యిసుమంతైన నిరుహేతుకమే

చ. 3:

శ్రీవేంకటేశ్వర నీకుఁ జేయెత్తి మొక్కుటయెల్ల
నీవే మావాఁడవై మన్నించుకొరకే
ఆవటించి అంతర్యామివై నీవుండుటయెల్ల
యేవలఁ జూచిన నిరుహేతుకమే