పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0314-05 దేశాక్షి సం: 04-082 గురు వందన, నృసింహ


పల్లవి :

ఎదిరికి మాకును యెక్కుడుతక్కువ లివి
పదిలపుజ్ఞానముచేఁ బవిత్ర మాయ


చ. 1:

మహిఁ బొడమినవెల్లా మంచివే యందులోఁ
దహతహ దేహమే తగనిది
యిహములో తృణములుయెండినా యోగ్యములాయ
బహి నిర్జీవపు మేను పనికిరాదాయ


చ. 2:

పుడమిఁ జల్లినవెల్ల పురుషార్థపదములే
కడుపున నిడుకొంటేఁ గానివి
గుడికొని యితరపు గోమయమే శుద్ధి యాయ
అడరి మానుషధర్మ మతి హేయ మాయ


చ. 3:

హరిసేవ గురుసేన నాత్మజ్ఞానమున కెక్కె
పొరలింపుఁగర్మమే పుణ్యమంటెకే
అరిది శ్రీవేంకటేశుడంతరాత్మకుఁ డితని
శరణనుటే సర్వసాధన మాయ