పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0౩90-01 మాళవిగౌళ సం: 04-520 రామ

పల్లవి:

రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను

చ. 1:

తటుకన మారీచు తలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను

చ. 2:

తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖర దూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను

చ. 3:

పొరిఁ గుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చె
మరలి గండము దాఁకె మండోదరికి
పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను