పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-01 లలిత సం: 04-442 శరణాగతి

పల్లవి:

అతఁడేయెరుఁగును మముఁబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుఁడు
అతికీ నతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారం బిఁక నేదో

చ. 1:

కనుచున్నారముసూర్యచంద్రులకుఘనవుదయాస్తమయములు
వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలికథలెల్లా
మనుచున్నారము నానాఁటికి మాయలసంసారములోన
తనిసీఁదనియము తెలిసీఁదెలియము తరువాతి పనులిఁక నేవో

చ. 2:

తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్థార్జన కొరకు
పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై
పెరిగెద మిదివో చచ్చెడి పుట్టెడి భీతిగలుగు దేహములోనే
విరసము లెరఁగము మరచీ మరవము వెనకటికాలము విధియేదో

చ. 3:

ఱట్టైనారము హరినుతిచే నాఱడి గురువనుమతిని
పట్టినారమిదె భక్తిమార్గమిదె బలువగు విజ్ఞానముచేత
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు
ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో