పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-01 బౌళి సం: 04-437 వైరాగ్య చింత

పల్లవి:

ఎప్పటిజీవుఁడే యెప్పటిజగమే యెంతగాలమును నీరీతే
కప్పుకవచ్చితి వనాదినుండియు కర్మమ యింకా వేసరవా

చ. 1:

మఱచితివా తొలుజన్మంబుల మరణకాలములదుఃఖపుబాట్లు
మఱచితివా యమకింకరులయి మర్దించిన బహుతాడనలు
మఱచితివా నరకకూపముల మాఁటికి మాఁటికిఁ బరచిన బాధలు
మఱియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా

చ. 2:

తలఁచవుగా జననకాలమునఁదనువిదియే యిటుపుట్టిన రోఁతలు
తలఁచవుగా బాల్యంబునఁ దల్లితండ్రుల శిక్షలు వ్యాథులును
తలఁచవుగా సంసారమునకును దైన్యంబును యాచించెటి యలమట
తలఁపుననిదియే వలెనని వోమెదు తనువా యింకా రోయవుగా

చ. 3:

కంటివిగా మలమూత్రాదుల కడుగఁగఁ దీరని దినదినగండము
కంటివిగా కనురెప్పలనే కాలముగడచేటికడత్రోవ
కంటివిగా శ్రీవేంకటపతి కరుణచేత నీ వివేకభావము
అంటి యిటువలెనె సార్వకాలమును అంతరాత్మ నినుఁదలఁచగా