పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0364-05 నారాయణి సం: 04-379 నామ సంకీర్తన

పల్లవి:

కావఁగ నీకే పోదు కరుణానిధివిగాన
భావించి నీవని తుదపదమే యెక్కితిమి

చ. 1:

కరి రాజ వరద నీకడనున్నవారికి
కరిరాజభయము లెక్కడాఁ బొందవు
సిరుల నీయర్థమే చింతించి చింతించి
నరలోకమెల్ల నీనగమె యెక్కితిమి

చ. 2:

కాళింగమర్దన నిన్నుఁగని మనువారికి
కాళింగభయములెక్కడా లేవు
తాలిమితో నిదియే తలపోసి తలపోసి
కేలి మనుజులము నీగిరియె యెక్కితిమి

చ. 3:

కందువ శ్రీ వేంకట కటకేశ నీవద్ద -
నెందుఁ గటకేశభయమిఁక లేదు
యిందుకే పో జగమెల్లా నిటు శరణని మూల
కందువ నీదండ శ్రీ వేంకటమె యెక్కితిమి