పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-05 సామంతం సం: 04-355 ఇతర దేవతలు

పల్లవి:

తానే తానే యిందరి గురుఁడు
సానఁ బట్టిన భోగి జ్ఞాన యోగి

చ. 1:

అపరిమితములైన యజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ది పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మ యోగి

చ. 2:

అన్ని చేఁతలును బ్రహ్మార్పణవిధి జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరఁగఁ గరుణించ
పన్నగ శయనుఁడే బ్రహ్మ యోగి

చ. 3:

తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాస యోగి