పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-02 లలిత సం: 04-334 నామ సంకీర్తన

పల్లవి:

సోదించిరిదియె సురలును మునులును
ఆదికి ననాది హరినామం

చ. 1:

అరిది వేదశాస్త్రార్థసంగ్రహము
అరయఁగ నొకటే హరినామం
దురితహరము భవదుఃఖనాశనము
అరిభయంకరము హరినామం

చ. 2:

సకలపుణ్యఫలసారవిహారము
అకలంకము హరినామం
ప్రకటము సులభము పరమపావనము
అకుటిలమిది హరినామం

చ. 3:

కందువ సదరము కైవల్యపదము
అందరికిదియే హరినామం
యెందును శ్రీవేంకటేశ్వరు కరుణకు -
నందుకోలైన హరినామం