పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-06 గుండక్రియ సం: 04-331 కృష్ణ

పల్లవి:

అందిచూడఁగ నీకు నవతారమొకటే
యెందువాఁడవై తివి యేఁటిదయ్యా

చ. 1:

నవనీతచోరా నాగరపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా

చ. 2:

పట్టపు శ్రీరమణా భవరోగవైద్య
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ
పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి
యెట్టని నమ్మవచ్చు నిది యేఁటిదయ్యా

చ. 3:

వేదాంతనిలయా వివిధాచరణా
ఆదిదేవ శ్రీవేంకటాచలేశ
సోదించి తలఁచినచోట నీ వుండుదువట
యేదెస నీ మహిమే యిదేఁటిదయ్యా