పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0346-03 శంకరాభరణం సం: 04-270 అద్వైతము


పల్లవి :

చెప్పఁబోతే యీ యర్ధము చిత్తము వొడఁబడదు
తప్పులు వెదకకురో తత్వజ్ఞులాల


చ. 1:

చెలఁగి మిథ్య యంటాఁ జేసేయజ్ఞాలు ఫలించునా
యిల శూన్యోపాసకుల కేడ దేవుఁడు
లలి మాయా శబళితులకు మోక్ష మెక్కడిది
నలి నభేదవాది కానందానుభవ మేది


చ. 2:

హరి శరణు చొరనియట్టివారికి దిక్కేది
గురుఁడు వేరే లేఁడట కోరి వుపదేశమేది
వెరసి శిఖాసూత్రాలు విడిచితే ప్రణవమేది
పరగ భక్తి లేదట భవమేట్టు గడచె


చ. 3:

శ్రీవేంకటేశుముద్ర ధరించక వైకుంఠమేది
యీ విభుపేరు జపించకెట్టు పాపా లుత్తరించు
వేవేగ దాసుఁడుగాక వెట్టికేల కరుణించు
సేవించినఁగాక సర్వచింతలేల యుడుగు