పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0305-01 రామక్రియ సం: 04-025 అంత్యప్రాస

పల్లవి:

భావించరో వేదములు పలికేటి వునికి
జీవులు బ్రహ్మానందముఁ జెందేటి వునికి

చ. 1:

నిచ్చలు నిద్దురలకు నెలవైన వునికి
యిచ్చలఁ గలలు గన నిరవైన వునికి
కుచ్చిన నిట్టూర్పులకొన దాఁకే వునికి
తచ్చిన మాటలధ్వని దాఁకేటి వునికి

చ. 2:

మునుకొన్న చూపులకు మొదలైన వునికి
అనిశము కతలెల్ల నాలకించే వునికి
వెనుకొన్న చవులెల్లా వెలవెట్టే వునికి
గునిసి మేల్‌కనుటకు గురియైన వునికి

చ. 3:

వావిరి నింద్రియపరవశమందే వునికి
కైవశమై పదియారుకళలుండే వునికి
చావకుండా నమృతము జాలువారే వునికి
శ్రీవేంకటేశుపాదాలు చింతించే వునికి