పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0327-04 ముఖారి సం: 04-157 నృసింహ


పల్లవి :

సేవించరో జనులాల చిత్తజగురుఁ డీతఁడు
కేవలదయానిధి సుగ్రీవనారసింహుఁడు


చ. 1:

వేయిచేతులతోడ వెన్నెలనవ్వుల తోడ
చాయలు దేరేటి శంఖచక్రాలతోడ
అయితమై వున్నవాఁడు అదె సింహాసనముపై
శ్రీయుతుఁడై యెదుట సుగ్రీవనారసింహుఁడు


చ. 2:

కుంకుమగోళ్ల తోడ కోరదౌడలతోడ
అంకెలరవిచంద్రనయనములతో
తెంకి నసురలఁ గొట్టి దేవతలకందరికి
కింకలెల్లాఁ బాపెను సుగ్రీవనారసింహుఁడు


చ. 3:

బిరుదు పెండేలతోడ పీతాంబరముతోడ
సరిఁ గిరీటాదిభూషణములతో
సిరులకెల్లా నెలవై చెలఁగి శ్రీవేంకటాద్రి-
గిరిమీఁద వెలసెను సుగ్రీవనారసింహుఁడు