పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0318-02 భవుళి సం: 04-103 విష్ణు కీర్తనం


పల్లవి :

నీకంటే నితరము మరి లేదు నేనెవ్వరితో భాషింతు
యేకో నారాయణుఁడవు నీవని యెన్నచు నున్నవి వేదములు


చ. 1:

యెక్కడచూచిన నీరూపంబులే యెవ్వరిఁజూచినఁ దోఁచిని
వెక్కసముగ నీమహిమ యనంతము విశ్వాత్మకుఁడవుగాన
నిక్కి యెవ్వరిని బేర్కొని పిలిచిన నీనామములై తోఁచీని
వక్కణించఁగా సకలశబ్దములవాచ్యుఁడవటు గాన


చ. 2:

యేపనిచేసిన నీపనులే అవి యివ్వలనవ్వలఁ దోఁచీని
పాపపుణ్యమని తోఁచదు నీవే పరచైతన్యమవటు గాన
దాపుగ మతిలోనేమి దలఁచినా ధ్యానము నీదైతోఁచీని
లోపల వెలుపల నిండుక వుండెది లోకపూర్ణుఁడవు గాన


చ. 3:

యీ యర్థమునకు నేననువాఁడను యెక్కడ నున్నాఁడ నీలోనే
కాయధారినై యేర్పడి నీలోఁగాక చరించితి యిన్నాళ్లు
యీ యపరాధము యెంచకుమీ నను యిందునె పో నీశరణంటి
పాయక నిన్నిఁక శ్రీవేంకటపతి పరబ్రహమవుఅటు గాన