పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-5 సామంతం సం: 09-257

పల్లవి:

కోడెకాఁడు వీఁడె వీఁడె గోవిందుఁడు
కూడె నిద్దరుసతుల గోవిందుఁడు

చ. 1:

గొల్లెతల వలపించె గోవిందుఁడు
కొల్లలాడె వెన్నలు గోవిందుఁడు
గుల్ల సంకుఁజక్రముల గోవిందుఁడు
గొల్లవారింటఁ బెరిగె గోవిందుఁడు

చ. 2:

కోలచేఁ బసులగాచె గోవిందుఁడు
కూలఁగుమ్మెఁ గంసుని గోవిందుఁడు
గోలయై వేలఁ గొండెత్తె గోవిందుఁడు
గూళెపుసతులఁ దెచ్చె గోవిందుఁడు

చ. 3:

కుందనపు చేలతోడి గోవిందుఁడు
గొందులు సందులు దూరె గోవిందుఁడు
కుందని శ్రీవెంకటాద్రి గోవిందుఁడు
గొందిఁ దోసె నసురల గోవిందుఁడు