పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0074-6 ఆహిరి సం: 05-258

పల్లవి:

వలతునందువు నాకు వడినెప్పుడును నేఁ-
డెలమి నొకచో భావ మెట్లుండె నీకు

చ. 1:

బరువైన మదనతాపంబునకు వెరవకిటు
పురవేదనలను నేఁబొరలఁగాను
సరసమున నీవచట సతులకౌఁగిటనుండి
యిరవుకొననపుడు మనసెట్టుండె నీకు

చ. 2:

వదలిన తురుముతోడ వాడువదనముతోడ
వొదిగినేనిటు చింతనుండఁ గాను
సదమదముగాఁగ నొకసతిని గౌఁగిటి రతుల-
గదియంగఁ జిత్తమేగతి నుండె నీకు

చ. 3:

జమలి మొలనూళ్ళతో జవ్వాదిమేనితో
నమరి యీరీతి నేనలరఁగాను
కొమరొందఁ గూడితివి కోనేటిరాయ నీ-
తమకమెందాఁక నెంతటినుండి నీకు