పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-5 సామంతం సంపుటం: 06-053

పల్లవి:

తగని మాటలేలె తలపోఁత లవి యేలె
తెగు వేలె యిటువంటి దిట్టతన మేలె

చ. 1:

నున్నని చెమట లేలె నొసలఁ బట్టిదియేలె
చిన్నఁబోయియుండనేలె చెక్కిటఁ జేయేలె
విన్నని నగవు లేలే వెరగుఁజూ పిదియేలె
కన్నులఁ గోప మదేలె కాఁతాళమేలె

చ. 2:

వ్రేఁకపుటూరుపు లేలె వెచ్చని మే నిదియేలె
తాఁకియుఁ దలఁచ వదేలే దప్పిదేర వదేలె
చీఁకటి ద్రవ్వెదవేలె చీఱినఁ బలుకవేలె
ఆఁకలిదడవవేలె అవలిమోమేలె

చ. 3:

కొప్పు వదలిన దేలె గుబ్బలపై జీర లేలె
దప్పులు మోమున నేలె తడఁబాటు లేలె
చెప్పక దాఁచెదవేలె చెలియరో తిరువేంక
టప్పనిఁ గలసి మమ్ము నణఁకించె వేలె