ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0047-6 శంకరాభరణం సంపుటం: 06-036
పల్లవి:
మచ్చికల మఱపులకు మదనబాధల మేను
వెచ్చినా నేమిటను విడువదీబాధ
చ. 1:
తను వయో మదమునకుఁ దమకములచే బాధ
గొనకొన్న తమికి రతికోర్కి బాధ
అనుభవనరతికిఁ బాయని ప్రేమముల బాధ
ఘనకూటమికి వియోగములచే బాధ
చ. 2:
తఱి విరహ వేదనకు తలపోఁతచే బాధ
పఱచుఁదలఁపులకుఁ దాపముల బాధ
తఱచు తాపంబులకుఁ దడఁబాటుచే బాధ
పఱివోనినేర్పులకు పరవశము బాధ
చ. 3:
అలరు సింగారముల కలపుఁ జెమటల బాధ
చెలియ చెమటకుఁ దావిచేతి బాధ
కలికితనములకు వేంకటవిభుని రతిఁ గూడి
కొలఁదికిని మిగులు సిగ్గులచేత బాధ