పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

1906లో ఏర్పడిన ఆల్‌ ఇండియా ముసిం లీగ్ స్వరూప స్వభావాలను నిర్దేశించడంలో శ్రద్ధ తీసుకున్నఆయన లీగ్ వ్యవస్థాపక కార్యదర్శిగా లీగ్ ను మతతత్వానికి దూరంగా ఉంచేందుకు కృషి చేశారు. 1908లో ఆయన తన కార్యస్థానాన్ని పాట్నాకు మార్చారు. ఆ తరువాత రెండు దశాబ్దాల పాటు అటు జాతీయోద్యమంలో, ఇటు బీహార్‌లో ప్రముఖ రాజకీయ నేతగా అద్వితీయమైన పాత్రను నిర్వహించారు. 1914లో కాంగ్రెస్‌-ముస్లిం లీగ్ ల మధ్య సయోధ్యకు కారణమైన లక్నోఒప్పదం కుదర్చడానికి శ్రమించారు.

1916లో డాక్టర్‌ అనీబిసెంట్ నాయకత్వంలో ప్రారంభమైన HOME RULE ఉద్యమంలో బీహార్‌ రాష్ట్ర శాఖాధ్యక్షునిగా మజహర్రుల్‌ హఖ్‌ ప్రముఖ పాత్ర నిర్వహించారు. అనంతరం భారతీయులందర్ని ఒకేగాటన కట్టివేసి, బలమైన ఐక్యతను ప్రోది చేసిన ఖిలాఫత్‌-సహాయనిరాకరణోద్యమం ఆరంభం కాగానే మహాత్ముని పిలుపుమేరకు మజహర్రుల్‌ హఖ్‌ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లింల ఐక్యతకు ఆయన ఎంతగానో కృషిచేశారు. ఆ సమయంలో గాంధీజీతో ఏర్పడిన అనుబంధం వలన పాట్నా నగర సరిహద్దులో, 'సదఖత్‌ ఆశ్రమం' (Abode of Truth) పేరిట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని, అత్యంత విలాసవంతమైన జీవితం నుండి పూర్తిగా వైదొలిగి అతి సామాన్య ఫకీర్‌ జీవితాన్నిగడిపారు.

1917లో బీహార్‌లో జరిగిన మతకలహాలు కుదిపివేయగా, మత సామరస్యం కాపాడటం కోసం హిందూ సోదరుల మత మనోభావాలకు కష్టం కల్గించే విధానాలను విడనాడాలని ముస్లింలకు ఉద్బోధిస్తూ ఆయన పలు పర్యటనలు జరిపారు. ఆ బోధలకు మతదురహంకారుల ఉన్మాదం శాంతించలేదు. 1924లో మళ్ళీ మతకలహాలు భీబత్సాన్ని సృషించడంతో ఆయన మనస్సు వికలమైపోయింది. ఆయన ప్రత్యేక వైఖరి వలన 1926లో స్థానిక లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలలో హాఖ్‌ పరాజితులయ్యారు. ఆ ఓటమితో క్రియాశీలక రాజకీయాల నుండి విరమించుకున్నారు. రాజకీయాల నుండి ఆయన విరమించుకున్నప్పటికి జాతీయ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఆయనను దూరం చేసు కోలేదు . జాతీయ కాంగ్రెస్‌ అద్యక్ష పదవిని స్వీకరించమని కోరుతూ 1920 ఆగస్టు 20న, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆయన వద్దకు వచ్చి అభ్యర్థించినా హఖ్‌ అంగీకరించలేదు.

ఈ విధగా భారత రాజకీయాల మీద ప్రత్యేకంగా బీహార్‌ రాష్ట్ర ప్రజల హృదయాల మీద తనదైన విలక్షణ పంధాతో చెరిగిపోని ముద్రను వేసి, 'హిందూ-ముస్లింల ఐక్యతా ప్రవక్త' గా ఖ్యాతిగాంచిన మజహర్రుల్‌ హఖ్‌ 1930 జనవరి 2న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌