పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

73


మాట నిశ్చయమును మనసునఁ గృఛ్రయుఁ
              గలిగినఁ గలుగునే కలితభక్తి
మాటల వెఱపును మనసున నేర్పును
              నెఱపిన నెఱయునే నియతభక్తి
మాటల వివరము మనసున వైరము
              బరగినఁ గల్గునే పరమభక్తి
మాటల వలపును మనసున సొలపును
              బొలసినఁ గలుగునే లలితభక్తి


మాటలందుఁ బొందు మనసునఁ గుందును
మాటలందు రసము మనసు గడుసు
మాటలందు దృఢము మనమున శఠమును
నెసఁగుచుండ ఫలమె బసవలింగ!

144


కార్యంబు లేమిని గల్పించుకొన కవ
              సరము గా దనక యుత్సవము చెడక
త్రోపు సేయక చూచు చూపు దప్పక రేపు
              మా పన కంతలో మఱుగు వడక
లేమిఁ జూపకయ దాలిమిని దా నుండక
              యొఱపులఁ బోపక కఱకుఁ బడక
విధము దప్పక యసద్వృత్తిని బలుకక
              నేరమిఁ జూపక నెనరు విడక


కోరి జంగమంబుఁ గొనియాడునతఁడు స
న్మార్గుఁ డతఁడు భక్తిమతియుతుండు
లోకమాన్యుఁ డనుచు వీఁక నుతింతురు
భక్తజనులు బుధులు బసవలింగ!

145