పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

63


ఒక్కఁడు పుట్టించునో జీవరాసుల
             నొక్కనియందుఁ దా నుదయ మగునొ
యొక్కండు చంపంగ నొక్కఁడు సేయునో
             యొక్కండు జీవంబు లోలి నిడునొ
కాయంబు జీవుండు గదియునో జీవుండు
            కాయంబు లొందునో గలిసి యగునొ
కాయంబు లాదియో కర్మంబు లాదియో
            కాయకర్మంబు లొక్కటనె యగునొ


యనెడుధర్మ మిట్టు లొనర "సోమః పవ
తే" యటంచు సూక్తి మ్రోయుచుండుఁ
గాన శివుఁడె యాదికర్త యౌటకు వేఱె
ప్రత్యయంబు లేల బసవలింగ!

124


రాజసగుణమునఁ బ్రబలి "భవాయ న
            మో" యనఁ బుట్టించు మొదటికర్త
సాత్త్వికగుణమునఁ జాలి "మృడాయ న
            మో" యన రక్షించు మొదటికర్త
తామసగుణమునఁ దగిలి "హరాయ న
            మో" యన హరియించు మొదటికర్త
త్రిగుణంబులను బాసి నెగడి "శివాయ న
            మో" యన సుఖియించు మొదటికర్త


యాది నొక్కరుఁడు మహాదేవుఁ డనఁగను
మ్రోయునట్టి వేదములు దొడంగి
చదివి చదివి దుష్టజను లెట్లు మఱచి స
ద్భక్తిరహితు లైరి బసవలింగ!

125