పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

59

అశుచినిరసనము

ఆదిని విశ్వదేవార్పితాన్నమునందుఁ
           బ్రాణాహుతులు పెట్టఁబడునెయేని
ఆపితామహరుద్రరూపార్పితాన్నంబు
           ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని
భవ్యమహాదిత్యభావార్పితాన్నంబు
           ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని
బ్రహ్మార్పణం బైన పరమామృతాన్నంబు
           ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని


అట్ల విష్ణ్వర్పితాన్నంబు లగునయేని
శివుప్రసాద మెటులు దా నిషేధ మయ్యెఁ
దవిలి "హరభుక్త శేషం దదాతి" యనఁగ
బ్రాహ్మణు లెఱుంగ రేమొకో బసవలింగ!

116


శ్రుతిరత్న మైన యజుర్వేదసూక్తంబు
          పలుమాఱు "నో మితి బ్రహ్మ" మనఁగ
నేపార నారాయణోపనిషత్తు "స
          ద్బ్రహ్మపదాప్నోతి పరమ" మనఁగ
నెఱయంగ లైంగ్యోపనిషదియందును "నమృ
          తం బ్రహ్మయోనిం తథా" యనంగ
వెలయ నధర్వణవేదసూక్తియును "ప
          శ్యంతి సూరయొ" నాఁగ సాంగమైన


స్కాంద పారాశ రాదిత్య సౌర లైంగ్య
కూర్మ బ్రహ్మపురాణసంకులమునందు
రుద్రసాకారసిద్ధాంతరూపణంబు
బ్రహ్మ మని చెప్పఁబడు గాదె బసవలింగ!

117