పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

చతుర్వేదసారము


కృష్ణేశ్వరుం డని కృష్ణుండు గొల్చుట
            మహి విష్ణువాదులు మఱచిరయ్య
బ్రహ్మేశ్వరుం డని బ్రహ్మయుఁ గొలుచుట
            యేకాత్మవాదు లె ట్లెఱుఁగరయ్య
దేవేశ్వరుం డని దేవతల్ గొలుచుట
            కర్మవాదులు దీనిఁ గానరయ్య
సర్వేశ్వరుం డని సన్మునుల్ గొలుచుట
            శూన్యవాదులు దీనిఁ జూడరయ్య


దివిజ దనుజ మనుజ నివహంబు తమ తమ
పేళ్ళమీఁద నీశుపేరు మోపి
యిలఁ బ్రతిష్ఠ సేయు టిదియంతయును జగ
త్ప్రత్యయంబు గాదె బసవలింగ!

62


ఒనర ఋగ్వేదంబు నొగి "రుద్రశంతమే
             భీ" యని యతులగంభీరలీలఁ
జను యజుర్వేదంబునను "తవ రుద్రప్ర
             ణీతా" యటంచు విఖ్యాతలీల
నిల సామమున "నఘోరేభ్యో" యటంచును
            దవిలి మ్రోయను మహోదాత్తలీలఁ
గన నధర్వణవేదమునను "రుద్రేణాత్త
            మశ్నంతి" యనుచు సమగ్రలీల


మ్రోయ నఖిలవేదమూలంబు లింగప్ర
సాద మనుచు విషము శంకరునకు
నర్పితంబుఁ జేసి యారగించినయట్టి
ప్రతిభ మీకె యొప్పు బసవలింగ!

63