పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

17


జగతిలోపలను "యస్మా త్పరం నాస్తి" నాఁ
           బరమపరునిమీఁదఁ బరము గలదె
యింపారగా "ఏక ఏవ రుద్రోచ్యతే"
           యనఁగ రెండవరుద్రుఁ డాదిఁ గలఁడె
కూర్మిమై "సశివ ఏకోధ్యేయ" యనఁగ ధ్యే
           యుండు శివుండు వేఱొండు గలఁడె
యిల "అపరస్స మహేశ్వరో" యన మహే
           శ్వరుపైని మఱి మహేశ్వరుఁడు గలఁడె


యటులు శంకరుఁడు మహాదేవుఁ డీశానుఁ
డఖిలవేదవేద్యుఁ డభవుఁ డుండ
నితరసురులఁ గూళ లెట్లొకో భజియించి
భవనిమగ్ను లైరి బసవలింగ!

32


ఇంపారగా "పశూనాం పతయే నమో"
           యనఁగను బశుపతి యైనవాఁడు
భాతిమీఱ "దిశాంచపతయే నమో నమో"
           యనఁగ దిశాపతి యైనవాఁడు
తేజరిల్ల "గణపతిభ్యశ్చవో నమో"
           యనఁగ గణాధ్యక్షుఁ డైనవాఁడు
తేటపడ "సభాపతిభ్యశ్చవో నమో"
           యనఁగ సభాపతి యైనవాఁడు


ధ్యేయుఁ డనుచును సురులు నుతింపుచుండ
శిష్టజను లెల్ల హరుఁడె పో శ్రేష్ఠుఁ డనఁగ
భవుని మఱి రుద్రసూక్తులు ప్రస్తుతించు
భంగి నెఱుఁగరొ కూళలు బసవలింగ!

33