పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

చతుర్వేదసారము


బసవన్న శ్రీపాదపద్మముల్ భవవార్ధి
           పార మందించు తెప్ప లని తలఁచి
బసవన్న శ్రీపాదపద్మముల్ భవచయ
           ధ్వాంత మడంచు దీపంబు లనియు
బసవన్న శ్రీపాదపద్మముల్ రాజిలు
           భుక్తిముక్తికి సురభూజము లని
బసవన్న శ్రీపాదపద్మముల్ కల్పభూ
           జంబుల ప్రథమబీజంబు లనియుఁ


బ్రస్తుతింప నొప్పు బసవాధినాథుని
పాదసరసిజములు భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!

14


బసవన్న మహిమఁ జెప్ప న్విన్నఁ బాయు దు
           స్తరనిరంతరమహాతురభయంబు
బసవన్న మతిఁ దలఁప న్విన్నఁ బాయు దు
           స్స్వప్నదుశ్శకునదుర్జనభయంబు
బసవన్నఁ బేర్కొన్నఁ బాయు దుర్ధ్వాంతవి
           శ్రాంతేంద్రియక్రాంతచింతనంబు
బసవన్న యశ మన్నఁ బైఁగొన్నఁ బాయు భ
          వాటవీచ్ఛన్నదేహాశ్రయంబు


బసవ శర ణన్న ముక్తిసౌభాగ్య మెసఁగు
బసవ శర ణన్న విశ్రుతభక్తి చెందు
బసవ శర ణన్న భక్తిసౌభాగ్యమహిమ
యెసఁగు నని మిమ్ము స్మరియింతు బసవలింగ!

15