పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

131


నీకు శుద్ధాన్నపానీయాదు లర్పింప
           శుద్ధప్రసాదసంసిద్ధి కలిగి
శుద్ధప్రసాదసంసిద్ధార్పణము చేసి
           తత్ప్రసిద్ధప్రసాదంబు వడసి
తత్ప్రసిద్ధప్రసాదము సమర్పణ చేసి
           సుప్రసాదాత్మైకసుఖము వడసి
సుప్రసాదాత్మైకసుఖసమర్పణ చేసి
           భరితసుఖాతీతపథము వడసి


యాసుఖాతీతపథము లయ్యర్పణములుఁ
దన్ను నర్పించి తన్నె కా నిన్నుఁ బడసి
యీప్రసాది మహార్పితం బౌ ప్రసాది
నెసఁగ నేమని వర్ణింతు బసవలింగ!

260


తాను ముట్టక పదార్థములైన నర్పింప
             నవి నీవ చే ముట్టి యవధరింపు
తను ముట్టనీక తద్ద్రవ్యమ్ము లర్పింప
             నవియు ముట్టఁగ నేర్చి యవధరింపు
తాను నీలోఁ జొచ్చి తత్సమర్పణ సేయ
             నతని నీలో నుంచి యవధరింపు
తనలోన నిను నిడి తత్సమర్పణ సేయ
            నతని నీలో నిడి యవధరింపు


తత్ప్రసాదార్పణము చేసి తన్ను నీకు
నర్పణము సేయ నీవును నందుఁ జొచ్చి
యాప్రసాదంబు నిడఁ దన్మహాప్రసాద
మెసఁగ నర్పించుఁ దప్పక బసవలింగ!

261