పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

127


నీవు చూడఁగఁ జూచు నీవు నూకఁగ నూకు
              చూపులు రూపులు రూపవితతి
నీవు మూర్కొనఁ గొను నీవు నూకఁగ నూకు
              ఘ్రాణంబు ఘ్రాణదుర్గంధచయము
నీవు వినఁగ విను నీవు నూకఁగ నూకు
              శ్రవణముల్ శబ్దాదిశబ్దచయము
నీ వానఁగా నాను నీవు నూకఁగ నూకు
             రసనయు రసము నీరసమునట్ల


నీవు పొందంగఁ బొందును నీవు నూక
గరిమ దక్కఁగ నూకును గఠినములను
నిష్టలింగప్రసాదమ్ము నెఱుఁగువాని
కెసఁగు సిద్ధనిషిద్ధముల్ బసవలింగ!

252


గంధ మైనను నీవు గంధింపకున్న దు
              ర్గంధంబు గాక సుగంధ మగునె
రూప మైనను నీవు రూపింపకున్న న
              రూపంబు గాక సురూప మగునె
శబ్ద మైనను నీవు చని వినకున్న న
              శబ్దంబు గాక సుశబ్ద మగునె
రుచ్య మైనను నీవు రుచియింపకున్న న
              రుచ్యంబు గాక సురుచ్య మగునె


యట్టులే యుండఁగా నెవ్వఁడైన నా ప్ర
సాది తెలియఁడె మఱి సుగంధాదిచయము
నేల పొందఁడు సద్గంధ మెఱిఁగినట్టి
ప్రాణలింగాంగి జగమున బసవలింగ!

253