పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

చతుర్వేదసారము


ఇప్పుడే శబ్దంబు లిచ్చి నీ కది నీవ
              తెచ్చి శ్రోత్రములచే నిచ్చి యిచ్చి
యిప్పుడే స్పర్శంబు లిచ్చి నీ కది నీవ
              తెచ్చి దేహంబుచే నిచ్చి యిచ్చి
యిప్పుడే రుచ్యంబు లిచ్చి నీ కది నీవ
              తెచ్చి రసజ్ఞచే నిచ్చి యిచ్చి
యిప్పుడే వాసన లిచ్చి నీ కది నీవ
              తెచ్చి ఘ్రాణంబుచే నిచ్చి యిచ్చి


యిప్పు డెవ్వియుఁ దలఁపఁగ నిచ్చి యట్టి
యెడను మదిఁ దృష్ణఁ గొనకయ గడన చెడక
యెంతయును నర్పణముఁ జేసి యింపు మీఱ
నెసఁగక ప్రసాదఫల మౌనె బసవలింగ!

230


చూపక చూడక చూపక చూచిన
               కనులపండువుగను గలక లేక
వినుపింపక వినక వినుపింప వినినను
               వీనులకును మఱి వెఱపులేక
అంటింప కంటక యంటింపకుండిన
               చేతుల దండిగా భీతి లేక
యానింప కానక యానింప కానిన
               జిహ్వకు దట్టమై చింత లేక


వీఁక మూరుకొనక వీఁక మూర్కొనిన ఘ్రా
ణంబు పండువుగ భయంబు లేక
యన్నివిషయములను బన్నుగాఁ దెలిసిన
వాఁడుపో ప్రసాది బసవలింగ!

231