పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

చతుర్వేదసారము


అయ్య! నీధర్మమే! యాదివృషభమూర్తి!
              జియ్య నీధర్మమే శివవిలాస!
భవ్య! నీధర్మమే! ప్రమథసంగాసంగ!
              దేవ! నీధర్మమే! దివ్యమహిమ!
స్వామి! నీధర్మమే! సచ్చిదానందాత్మ!
              నాథ! నీధర్మమే! నవ్యరూప!
దివ్య! నీధర్మమే! త్రిజగదేకారాధ్య!
              విభుఁడ! నీధర్మమే! విషవిదళన!


అవధరింపు మయ్య! యక్కటా యను మయ్య!
కావు మయ్య! నన్నుఁ బ్రోవు మయ్య!
కరుణఁ జూడు మయ్య! శరణార్థిఁ జు మ్మయ్య!
భక్తి యొసఁగు మయ్య! బసవలింగ!

198


ప్రభుగుణస్తోత్రైకపాత్రుండు బసవయ్య
               శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
మాదిరాజయగారి మనుమండు బసవయ్య
               శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
మడివాలు మాచయ్య మదకరి బసవయ్య
               శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
కుమ్మరగుండయ్య తమ్ముండు బసవయ్య
               శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ


భక్తితోడ నీదు పాదపద్మంబులు
నమ్మి వెతల నెల్లఁ జిమ్మి మిగుల
భవభయంబు వాయు బంటను నీభక్తి
కెసఁగఁ జిక్కినాఁడ బసవలింగ!

199