పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

చతుర్వేదసారము


బసవయ్య నీస్తుతు లసలార విను భక్త
            గణసంస్తుతులు విను గ్రాహకుండ
బసవన్న నీనుతుల్ వాయక పఠియించు
            భక్తులఁ బ్రణుతించు పాఠకుండ
బసవయ్య నీస్తుతుల్ భక్తితోఁ గొనియాడు
            భక్తులఁ గొనియాడు భక్తిపరుఁడ
బసవయ్య నీస్తుతుల్ పచరించుభక్తులఁ
           బ్రచురింపఁ బాల్పడు భక్తిపరుఁడ


నిలను భక్తుల కీశుచే నీప్సితార్థ
భూరిసంపద లిప్పించు భూరిమహిమ
వినుచుఁ జదువుచుఁ గొనియాడి విస్తరించు
వాఁడ న న్నిటు కరుణించు బసవలింగ!

190


బిడ్డలఁ జీరెడు ప్రియ మెంత యనుచు నీ
            పేరు నాలింగంబుఁ బెట్టినాఁడ
నోలి నాఱొమ్మున మాలిమి నుండిన
            దైవ మనుచు నిన్నుఁ దాల్చినాఁడ
నిల నీకు వ్రే లిచ్చు వల పెంత యనుచు నా
            దేహ మంతయు నివేదించినాఁడఁ
బద్యముల్ చెప్పుట పరమశ్రేష్ఠం బని
            పద్యముల్ విరచించి ప్రబలినాఁడ


నట్లు గాన "దాస్యమాహుశ్చతుర్విధం"
బనిన వేదసూక్తి కగ్గలముగ
నెఱయఁ దక్కినట్టి నీదాసిఁ జు మ్మయ్య!
పటుదయాంతరంగ! బసవలింగ!

191