పుట:కాశీమజిలీకథలు -07.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యంతకన్న విచిత్రముగాఁ దానల్లఁజొచ్చినది. దినమునకొక వింతగా నల్లుచు మగ నికిఁగూడనాపని నేరిపినది. వారిరువురుంగలిసి మృగరోమముతోను, నడవియాకులు తోను, కడునద్భుతములైన తివాసులును, చాపలును, పెట్టెలును మంచ ములు లోనగు గృహోపకరణములు అత్యాశ్చర్యకరములైనవి, అల్లి వానిపై వెలలువైచి కోయలకిచ్చి గ్రామములకంపి అమ్మించుచుందురు. ఆవింతవస్తువులు జూచి జానపదులును బౌరులును మూఁగి మూఁగి వేగముగాఁ గొనుచుండిరి. దానం జేసి యాపల్లెలోని వారెల్ల నావస్తువులమ్మి పెద్దగా ధనము సంపాదించుచుండిరి. వారందఱు తమకుఁ బరిచర్య సేయుటతప్ప మఱియొక ప్రతిఫలము వారివలన నాదం పతులు కోరుటలేదు.

అందున్న కోయలెల్ల నాదంపతులను గురువులుగా దైవములుగాఁ బ్రభువు లుగాఁ దలంచి భయభక్తి వినయవిశ్వాసములతో సేవించుచుండిరి. అవ్వనవాసము యౌవనవిలాసములలో నొక వినోదము వారికిఁ గూర్చుచుండెను. పద్మినికిఁ గ్రమం బున నెలలు నిండుచుండెను. భిల్లపల్లవాధరుల నుపచారముల ననుమోదింపుచుండెను. గురుదత్తుండు హృదయంబునఁ బెట్టికొని యామెం గాపాడుచుండెను.

ఒకనాఁడు గురుదత్తుండు వింతయగు నొకతివాసీ నల్లుచు అందులకై మృదు వులగు పిట్టరెక్కలు కొన్ని కావలసి వనచరులం గూడికొని యాప్రాంతారణ్యమున కరిగెను. వలదు వలదు మనము క్షత్రియులముకాము. వేఁట మనకుఁ దగదు నోరు లేని పక్షుల మృగములఁ గొట్టవలదు. అకులతోఁ బూర్తిఁజేసెదనని పద్మిని బోధించు చున్నను వినక వస్తులోభంబునంజేసి అతఁడా అరణ్యములన్నియు దిరిగి తిఱిగి అలసి యొక చెట్టుక్రిందఁ గూర్చుండి యలయికలు తీర్చుకొనుచుఁ బిట్టల రెక్కలకై తోడివారిని నలుమూలలకుఁ బంపెను.

విధి చలపట్టి పట్టినవానినే మొట్టుచుండునుగదా? అంతలోనావృక్షాంతము నుండి యొకపాము నేలకుఱికి అతనిం గఱచి పారిపోయినది. తద్విష విశేషంబెట్టిదో నిమిషములోనే అతండు తెలివిదప్పి నేలంబడిపోయెను. అతనిదాపుననున్న వనచరు లదిచూచి యడలుచు నొకఁడు మందుచెక్కలకై పరుగిడెను. ఒకఁడింటికిఁ బరుగున వచ్చి యూర్పులడరఁ దివాసినేయుచున్న పద్మినింజూచి తల్లీ! తల్లీ! మా అయ్యగారు పాముగరచి నేలఁబడిరని చెప్పుటయుఁ బద్మిని గుండెలు బాదికొనుచు అయ్యో? అయ్యో? యెక్కడరా బాబూ? బ్రతికియుండిరా? హా? దైవమా? ఇంతటితో మమ్ము విడువవా? అని యరచుచు నేలంబడి మూర్ఛిల్లి అంతలోఁ దెప్పిరల్లి భిల్లుఁడా ! యెంత దూరములో నుండిరిరా? మాట్లాడుచుండిరా? నామాట యేమైన జెప్పిరా చెప్పుము