పుట:కాశీమజిలీకథలు -07.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోమిని కథ

171

దయాహృదయుండునునై తల్లి దండ్రుల ధనధాన్యములవిడిచి నాకడవసించి తన ప్రాణముకన్న నన్నెక్కుడుగాజూచు మదీయ ప్రాణనాధుని నాపత్సముద్రమున ముంచి ప్రాణముల విడుచుచుంటిని. ఓరాజబంధువులారా? ఈ కృత్యము నా మనో హరుండుగానిఁ నా తలిదండ్రులుగాని యించుకయు నెరుంగరు మీరు వారినేమియు దండింపవలదు. జన్మజన్మమునకు నాకు గురుదత్తుఁడే భర్త కావలయును. పూర్వ జన్మచరిత దురితంబునంజేసి సుగుణసంపన్నుండగునట్టి మనోహరునితో సుఖింప కుండ నిట్లు బలవన్మరణము నాకు దటస్థించినది. అందులకు నిదేనమస్కారము.

ఓ మనోహరా? గురుదత్తా? నీవు నన్నుఁ బరీక్షించి పెండ్లిఁజేసికొంటివి. నీమన్ననలచే బ్రహ్మానందము జెందుచుంటిని. తల్లిదండ్రుల విడిచి, ధనధాన్యముల విడిచి, బంధువులవిడిచి, దేశమువిడిచి, నానిమిత్తమిందు వసించితివి యిట్టినీతో సుఖిం చుటకు నాకుయోగములేకపోయినది. నాఁడు దేవతోత్సవములలోఁ నన్నుఁ జూచినది మొద లీదుర్మార్గుఁడు పంపెడు వార్తలకు మేరలేదు. మీతోఁ జెప్పిన నేమందురో యని త్రోసిపుచ్చితిని చివరకుఁ బ్రాణసంకటమైనది. నన్ను మీరు దుష్టురాలిగాఁ దలం చితిరేని‌ నాకుత్తమలోకములు గలుగవు. పుణ్యలోకమునకుఁ బోవునట్లు దీవింపుఁడు. మీకిదేకడపటి నమస్కారము ఓ తల్లి దండ్రులారా? మిమ్ము దుఃఖాంబుధిలోఁ బడివైచి యరుగుచుంటి నా కొరకు శోకింపక విరక్తిఁగలిగి పుణ్యకార్యము. లాచరిం పుడు మీకిదే నాచివరిమ్రొక్కులు అని వ్రాసి మడచి‌ యాచీటినందు విడచి వస్తువులు తీయుటకై మఱియొక గదిలోనిలికిఁబోయినది.

అదియంతయుఁ గ్రీగంటఁ జూచుచున్న గురుదత్తుఁడు అహా ! రంకుమగని కేదియో చీటి వ్రాసినది. చూచెదంగాకయని తలంచి మెల్లనలేచి యాచీటిని సం గ్రహించిమరల మంచముపైఁ బండుకొని యెఱుగనివానివలెనిద్రనభినయించుచుండెను.

అంతలోఁ బద్మిని‌ వస్తువులన్నియుం దీసి నడుము బిగించి కత్తి చేతంబూని ప్రాణనాధుని మంచమునకు మూడు ప్రదక్షిణములుజేసి కన్నీటిధారం బాదంబులు దడియమ్రొక్కుచుఁ దానువ్రాసిన చీటినందుఁగానక నలుమూలలు వెదికివెదకి యెందుంచినదిజ్ఞాపకము లేక తిరుగుచుండెను. ఇంతయేల మఱియొకచీటి వ్రాసెదనని తలంచి యక్కా౦త ఇంకొకగదిలోఁ గూర్చుండి వ్రాయుచుండెను.

ఆయవకాశము జూచి గురుదత్తుండా చీటిని దీపము వెలుగునఁ జదివెను. మేను ఝల్లున్నది. గుండెలు కొట్టుకొనఁ దొడంగినవి మనసు నీరైనది. అదివరకా మదిరాక్షి పైగల కోపమంతయు నటమటపైపోవ నిండించిన వాక్యములు దలంచికొని నేలం జతికిలపడి యేడువఁదొడంగెను. అంతలోఁదొందర పుట్టినది. అగదిలోనికింబోయి