పుట:కాశీమజిలీకథలు -04.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

కాదు. మహర్షులు సైతము దైవమాయామోహితులై నిశ్చయింపలేకపోయిరి. వేదము విడఁదీసి యష్టాదశపురాణములు చేసిన వ్యాసభట్టారకునికే సంశయము కలిగియుండ మనుష్యులకు శక్యమా? ఎవరి కిష్టమైన దైవమును వారారాధించుచుందురు. ఇందొకటి నిజము. రెండవది యబద్ధమని యెవ్వరును జెప్పలేరు. మీకు నమ్మకము కలిగిన దైవము నారాధింపుఁడని పలికిన విని యారాజకుమారులు తండ్రి నాక్షేపించుచు నిట్లనిరి. తండ్రీ! యెవ్వరికిని శక్యముగాని పనియే మేము శక్యము చేయుదుము. దైవమాయ దెలియక మహర్షులు నిశ్చయింపలేకపోయిరిగాని మేము నిశ్చయింతుము చూడుడు. పట్టుదల యున్నచో నెట్టికార్యమైన లభ్యము కాకమానదు. ఇప్పుడు మేమా మతబోధకుల నెల్లర రప్పించి వాదము కల్పించి యందు నిగ్గు తేల్చెదము చూడు" మని పలికిన విని సంతసించుచు నారాజు “కానిండు దానివలన నష్ట మేమి యున్న" దని యంగీకరించెను.

అమ్మఱునాఁడు రాజకుమారులు తమపట్టణములో నున్న యా యాయా మతబోధకులనెల్ల రప్పించి యొకసభఁజేసిరి. కొల్వుకూటంబంతయుఁ పండితులచే నిండింపబడియున్న సమయంబున రాజపుత్రులు విచిత్రవాగ్గుంభనలచే నుపన్యసించుచు మొదట వైష్ణవులలో నిట్లు సంభాషించిరి.

రాజపుత్రులు — అయ్యా! విష్ణుండు సర్వోత్తముండని చెప్పెడు వారెవరో నిలిచి ముందరకు రావలయును.

వైష్ణ -- అయ్యా! మేము మేము అని లేచి నిలువంబడిరి.

రాజ - మీ దేవుండు సర్వోత్తముం డెట్లయ్యెను. దృష్టాంతరము లేమి ?

వైష్ణ -- వేదములు పురాణములు శాస్త్రములు విష్ణుండు జగత్కారణుండని ఘోషించుచున్నవి. నారాయణము వినుండు. అని చదువఁబోవఁగా,

రాజ - (వారించుచు) మాకు పురాణములు వేదములు శాస్త్రములు నవసరము లేదు. ప్రత్యక్షముగా జూపవలయును.

వైష్ణ --- ప్రత్యక్షము కాకేమి? నీ దేవునడెందున్నాడని తండ్రి దండింపఁగా ప్రహ్లాదునికి స్తంభమున నరసింహాకృతిని బ్రత్యక్షంబై కాపాడెను. ద్రౌపదికిఁ గౌరవసభలో నవమానము కాగా బ్రార్దించినంతనే యక్షయమైన వలువలిచ్చెను. కలిసి గాచెను. అనేక దృష్టాంతరము లున్నవి. శైవులు మిమ్ము మోసముచేసి తమమతము బోధించినారు కాఁబోలు.

రాజ - వెనుకటి కథలు మాకవసరము లేదు. ఇప్పుడేమైనఁ బ్రత్యక్షముగా నతం దేవుఁడైనట్లు కనపఱుపఁగలరా ?

వైష్ణ - అయ్యో! కనబఁడకేమి. కాకాసురుని రక్షించినది యసత్యమా?