పుట:కాశీమజిలీకథలు -04.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సింహధ్వని వినిన మదగజంబుమాడ్కి దదియోపన్యాసము విని యాపండిత వేదండములు భీతస్వాంతులై పెదవిగదుపఁ జాలక యట్టె చూచుచుండిరి.

అంతలో నియమిత కాలప్రబోధకంబగు ఘంటానినాదంబుశ్రోతానందము గావించినది. అప్పుడు రామలింగ కవిలేచి సభ్యురారా ! నేఁడీ బాలకుని యుపన్యాసము విని యెంతయు సంతసించితిమి. వీని ప్రశ్నలకు రేపుత్తరములు చెప్పుదుము

వీని యంతసార మేపాటియదియా తెలియవలయునని యింత దనుక నుపేక్షించి చూచుచుంటిమి. రేపు తప్పక మీరందఱు దయచేసి యస్మద్విద్యా పరిశ్రమ మెట్టిదో తెలిసికొనఁ గోరుచున్నా వారమని పలుకుటయు సభాస్థారులెల్లఁ గరతాళములు వాయించిరి. అంతటితో నా సభ ముగించుటచే నందరు నిష్క్రమించిరి.

అమ్మఱునాఁడు యధాకాలమునకు దేవగుప్తుఁడు మఱల సభకరుదెంచెను. పౌరులు పెక్కండ్రా సంవాదము వినవలయునని సభనలంకరించిరి. మంత్రులు సామంతులు హితులు పురోహితులు సేవింప మలయధ్వజుండు కొల్వుదీర్చి కూర్చుండి రాయలవారి పండితులరాక నరయుచుండెను. మిక్కిలి విశాలమగు నా సభాభవనంబున నా పండితుల యెనిమిదిపీఠంబులు దక్కఁ దక్కినస్థలమంతయు జనులచే నిండింపఁ బడినది. సభ్యుల దృష్టులు రాయలవారి పండితులరాక జూడ నా ద్వారదేశమున వ్యాపించుచున్నవి. ఎంత సేపటికి వారిజాడఁ గనంబడినదికాదు. నియమితకాల మతిక్రమించుటయు నాఱేఁడు కోపము చేయుచు వారిం దీసికొనిరమ్మని తద్వాసస్థానమునకు పలువుర దూతలం బంపెను. వాండ్రువోయి ముహూర్తకాలములో వచ్చి దేవా ! ఆ విడిదిలో నెవ్వరునులేరు. శూన్యమైయున్నది నలుమూలలు వెదకిన నొక తలుపున నీ పత్రిక వ్రేలంగట్టబడియున్నది. చూడు డని యొక కాగిత మాపతికిచ్చిరి. అందు -

మహారాజా ! మేము యధార్ధమైన రాయలవారి పండితులముకాము. విష్ణుగుప్తున కిట్టి కొమరుం డున్నవాఁడని యెఱుఁగక వానిం బెదరింప నిట్టివేషములతో వచ్చితిమి, మా కతండు దాయాదుండగుట నీ తెఱంగున నతని బరిభవింపవలయునని తలంచితిమి. అతని పాండిత్యము మాకుఁ దెలియును. దేవగుప్తునితో మేము ప్రసంగింపఁ జాలము నేఁడు సభకువచ్చినఁ బరాభవమగు నని యంతర్హితులమైతిమి. మా తప్పులు మన్నింపుము అని వ్రాయబడియున్నది. (అందరు పకపక నవ్వుచున్నారు) భూభర్త సంతోషము పట్టజాలక మానందభాష్పములతో దేవగుప్తుం గౌఁగలించు కొనియెను.

అప్పుడు సభ్యులెల్లరు దేవగుప్తుఁ బుష్పములచేఁ బూజించిరి. పిమ్మట నమ్మనుజపతి మంత్రులతో నాలోచించి రాయలవారి కప్పుడే యొక యుత్తర మిట్లు వ్రాయించెను.