పుట:కాశీమజిలీకథలు -04.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నేను దలయెత్తి తిరుగఁగలనా ? క్షత్త్రియ వంశమున జనించి చేపలుపట్టికొని బ్రతికెడు బెస్తవానిచే దెబ్బలు తిని ప్రతిచేయక జీవించుటకంటె నీల్గుటయే శ్రేయమని యేమేమో చెప్పి తండ్రికి రోషము పురికొలిపెను. అప్పుడా రాజు కానిమ్ము. వాఁడు దొరికిన తరువాత విమర్శించెద. ఇప్పుడేల? యని వానిం బట్టుకొనుటకు నలుమూలలకు దూతలం బంచి యప్పుడే తా నంతఃపురమున కరిగెను.

ఆ సంభాషణ విశేషము లన్నియు విని తిలక లలితయొద్ద కరిగి, తరుణీ ! ఆ పురుషుండు పల్లె వాని కొడుకు కాఁడట. వింటివా ! వానికి గంగలో నిడ్డజాలములో దొరికెనఁట. వాఁడు పాఱిపోయెనఁట. పాపము వాని కిట్టుముప్పు తెచ్చి పెట్టినవారము మనమే కదా. వాఁడు రానని పోవుచుండఁగా బ్రతిమాలికొని తీసికొనివచ్చితిని. వానియం దే నేరము లేదు. మీ యన్న యడ్డగింపఁగాఁ ద్రోసికొని పోయెనట. దానికిఁ గొండంతఁ జేసి మీ యన్న తండ్రితోఁ జెప్పెను. మీ తండ్రియు వానిం బట్టికొనిరమ్మని దూతలం బంపినా రివియే సభావిశేషములని చెప్పగా నా యొప్పుల కుప్ప యెట్టెట్టూ ? వాఁడు పల్లెవానికి గంగలో దొరకెనా ? బాగు బాగు, ఈమాటు నచ్చినది వాఁ డెవ్వఁడో యుత్తమవంశ సంజాతుఁడు కానిచో' నన్ని లక్షణములుండవు. వాఁ డెక్కడికిఁ బాఱిపోయెనో రహస్యముగాఁ దెలిసికొనిరమ్ము . మనము గూడఁ బోవుదమని సాభిలాషముగాఁ బలికిన నాలాగే పోవచ్చును. వేయిజన్మములెత్తిన నటువంటి భర్తను సంపాదించుకొనఁ గలవా ? యని తిలక యుత్తరముఁ జెప్పినది. అంతలో మరియెవ్వరో యచ్చటికి వచ్చుటచే నా ప్రసంగము మానివేసిరి.

నాఁటి రాత్రి యంతయుఁ దిలక పుష్పహాసుని మందిర ప్రాంతమందుఁ దిరుగుచు నతని చరిత్ర యంతయు విమర్శించి మఱునాఁడుదయ కాలంబున లలిత యంతఃపురమునకు వచ్చినది. అప్పుడు లలిత తల్పంబునం గూర్చుండి చెక్కిటఁ చేయిజేర్చి యెద్దియో ధ్యానించుచు నల్లగలువరేకులపై మకరందము చిమ్మినట్లు కాటుక కన్నుల నశ్రజలమ్ము గ్రమ్మ వెక్కి వెక్కి యేడ్చుచుండుట తిలకించి తిలక పలుకరించి కలికీ! యిదియేమి ? అకారణముగాఁ గుందుంచుంటివని యడిగిన నప్పడఁతి తలయెత్తి నఖరశిఖరంబున నశ్రువులు వెదఁజిమ్ముచు నల్లన నిట్లనియె.

సఖీ ! పుష్పహాసుఁడు రాత్రి కలలోవచ్చి నా శయ్యపై గూరుచుండి నన్నక్కున జేర్చుకొని చెక్కులు ముద్దాడుచు మోవిపుడుకుచుఁ బ్రాణేశ్వరీ ! నేను విదేశముపాలై పోవుచున్నాను. నా డెందము నీయంద తగులుకొని రాకున్నది. మరుఁడు విరిబాకుపోటుల నా యెడద నాటు నేయచున్నాడు. ఏమిచేయుదును ? భవదీయ సల్లాపంబులఁ దలంచుకొనుచు విదేశమునఁ ప్రాణధారంబుఁ జేసికొనియెద . ననుగ్రహ ముంచుమీ యని పలుకుచుఁ దద్దియుం బ్రీతిమొగంబున విన్నఁదనంబు దోప శయ్య నొయ్యన డిగ్గి యవ్వలికిం బోయెను బోఁటి ? వానిమాటలం దలంచుకొని మదిపగిలిపోవుచున్నది. ఆ సుందరు నిట్టి చిక్కులం బెట్టిన వారము మనమే కదా !