పుట:కాశీమజిలీకథలు -04.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మగుటయు మదనమంజరిక బోధించిన ప్రకారము మంజువాణి కేకలు వైచుచు నొడలు గీఱుకొని తలవిరియఁబోసికొని యేడువఁ దొడంగినది. ఆ సద్దు విని నృపాలుం డదరిపడి రెండవభార్య యంతఃపురమునుండి యక్కడికివచ్చి మంజువాణి యాకార వికారమునుజూచి భయపడుచుఁ బలుకులు దడఁబడ నేమి యేమని తొందరగా నడిగెను.

అప్పుడు మంజువాణి కొంతసే పేమియుం జెప్పక శోకమభినయించుచు నెట్టకేలకుఁ గన్నీరుదుడిచికొని మహారాజా ! పడుచు వాండ్ర నంతఃపురములలోఁ గాపు వెట్టిన నీకంటె నవివేకి యెందై నంగలఁడా ? ఆక్రూరాత్ముఁ డేమిచేసెనో చూచితిరా ? అయ్యో ? చెప్పుటకు నోరాడకున్నని. మీరు రానిసమయము కనిపెట్టి దొంగవలె వచ్చి ముచ్చటలాఁడ మొదలుపెట్టెను. నీ కిందేమి పనియున్నదని యడగిన నిన్ను వలచి వచ్చితినని చెప్పెను. ఆ మాటవిని నేను భయపడి మెల్లన లేచి లోపలికిఁ వోవఁ దలంచు నంతలోఁ జేయిపట్టుకొని యేమేమో చేయఁ దొడంగెను. నేను గేకలు వైచితిని. నా సఖురా లీమదనమంజరిక వచ్చి విడిపించినది. అంతలో వాఁడు పాఱి పోయెను. మంత్రి కాతెఱంగెఱింగింపుమని నా రెండవదాది నంపితిని. అదివోయి మంత్రిని లేపి యావార్తఁ జెప్పిన నతండు వానిం దఱిమికొని పోయెనని చెప్పినది. ఇంతవట్టునిక్కువము తరువాత నేమిచేయవలయునో మీరే ప్రమాణమని యూర కున్నది.

అప్పు డారాజు క్రోధావేశ హృదయుండై మదనమంజరిక నడిగిననదియు నట్లే చెప్పినది. ఔరా ! యౌవనమద మెట్టివానిని దుర్గుణుం జేయక మానదు. ఆ చిన్నవాఁ డుత్తముఁడని నమ్మి నేనే మోసపోయితిని. దాననే కదా పెద్దలు శుద్ధాంతముల వృద్ధులం గంచుకులఁగా నియమించి కాపు పెట్టుదురు. కానిమ్ము. ఇప్పు డేమి యనుకొనినను బ్రయోజనము లేదని తలంచుచున్న సమయములో నొక దాది వచ్చి సుములు నెవ్వరో చంపి కందకములోఁ బాఱవైచిరని చెప్పినది.

ఆ మాట విని రాజు --------- చిత్తముత్తల పెట్టి సత్వరముగాఁ బోయి చూచినంత మంత్రి కందకములో నీటిపైఁ దేలియుండెను. పరీక్షించినఁగంఠము నఱకబడియున్నది. ఆ కృత్యమా చిన్నవాఁడే చేసినట్టు నిశ్చయించి తానొక్కరుఁడ యా రాజపుత్రుఁడున్న మందిరమున కరిగెను. అట్టి సమయమున నతండు తల్లి తో "అమ్మా ! మన మిందుండరాదు. మఱియొక దేశమునకుఁ బోవుదము రమ్మని చెప్పుచుండ నాయనా ! అట్లనుచున్నావేమి ? యీ రాజు కడు ధర్మాత్ముండని చెప్పు చుందువే? యీతని కొల్వుమాను కొనునంత యవసర మేమి వచ్చినదని యడిగిన నా మాట కేమియు నుత్తరముఁ జెప్పక అది నా ప్రారబ్దమని పలికెను. ఆ మాటలారాజు చెవిని బడినవి. వాని సపరాధిఁగా నెంచి యా రాజు చయ్యన లోనికింబోయెను. రాజపుత్త్రుఁడు రాజుంజూచి యక్కజమందుడు లేచి నిలువంబడి నమస్కరించెను.