పుట:కాశీమజిలీకథలు -04.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నరిగి రత్నమాలఁ గుఱించి మీరనుకొనిన సాంకేతిక మేమియో నాకుఁజెప్పుడు వారిం గోరికొనియెను. వారు నవ్వుచు దివాణము దాపుననున్న రాజుగారి సత్త్రమునకుం బోయిన నంతయుం దెలియునని చెప్పిరి. ఆ మాటలు విని యతఁడు సత్త్రమున కరిగి యందొకచోఁ గాంచనపటంబున వ్రాయబడియున్న అ విగ్రహమును జూచి తాను గలలోఁ బెండ్లియాడిన చేడియ యదియేనని తెలిసికొని విరహతురుండై విలపింపం దొడంగెను.

అప్పు డందున్న కావలివార లతనిం బట్టుకొని రాజుగారి యెదుట బెట్టిరి. అమ్మఱునాఁడా రాజు విషయము విమర్శించి యతని చిత్తరువు తన పుత్రికయగు రత్నమాలయొద్ద కనిపెను. ఆ చిన్నది యతని వరించినది ఆ నృపతి వారికి వివాహము గావించెను. బలభద్రుం డా రత్నమాలతోఁ గొన్ని దినములు యథేష్టకామోప భోగసుఖంబు లనుభవింపుచు నొకనాఁడెద్దియా కారణమున సోదరులమాట జ్ఞాపకము వచ్చుటయు నచ్చెల్వకుఁ జెప్పకుండ నన్నిశానంబున శుద్ధాంతోద వసితంబు విడిచి యేకాంతముగాఁ బురంబెల్ల విమర్శించి సోదరులం గానక విచారముతో నొక తెరువునం బడి నడువఁదొడంగెను అట్లు పోవుచుఁ గనంబడిన వారినెల్ల వారిజాడ నడుగుచుఁ బోయి పోయి యొకనాఁడు ప్రాతఃకాలమునకు జంద్రకాంతపురంబునకు వచ్చెను. అందు మార్గాయాసంబు వాయ నొక తటాకంబున జలకమాడుచున్న సమయంబునఁ గొందఱు స్త్రీ లిట్లు సంభాషించుకొనిరి.

రామలక్ష్మి - సోమిదేవమ్మక్కా! ప్రొద్దెక్కి వచ్చావేమి? బావగారూళ్ళోలేరా యేమిషి? నా యొక్క మాటిస్తావూ?

సోమిదేవి - ఇస్తా ఇస్తా అయినది. నిలుచో వూళ్ళోనా! లేరు.

రామలక్ష్మి - (నిలబడి) ఏ వూరువెళ్ళినారు. అ స్తమానము వూరికె వెడతారేమి.షి అగ్గిహోత్రా యున్నాయా?

సోమిదేవి - అగ్నిహోత్రాలు లేవు. మొన్ననే తీసివేసినాము. అఘ్ఘరారము వెళ్ళినారు. ధర్మశాస్త్రాలన్నీ మా మీఁదనే వున్నాయి కాదషో? మీ యాయన మల్లే మా ఆయన ఇంట్లో కూర్చోడానికి వల్లా?

రామ — అవును. మా ఆయనమల్లే మీ ఆయన యింట్లోగూర్చుంటే నీవున్ను నాకుమల్లేనే వుందువు. కంటెలు కాసుల పేర్లు వడ్డాణులు ఎట్లువస్తవి.

సోమిదేవి - సరి సరి. ఇది ఆయన ఘరణ అనుకున్నాడా యేనిగనియెగ్గంలో నాకువచ్చిన డబ్బుపెట్టి చేయించుకొన్నాను.

రామ - అదిమాత్రం ఆయన ఘరణకాదా యేమిషి? అవునుగాని అఘ్ఘరార మెందుకు వెళ్ళినారు. ధర్మశాస్త్రాలు యేమివచ్చినాయి?

సోమిదేవి - (మెల్లగా) రాజుగారి కూఁతురుమాట విన్నావా?