పుట:కాశీమజిలీకథలు -04.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అట్లు పండితభట్టు యమునితోఁ గలహించి కుమారుని బ్రతికించుకొని యెనిమిదవయేటనే వానికి నుపనయనముఁ గావించెను పీఁటలపైఁ గూర్చుండి కుమారుని మెడలో జన్నిదము వైచుట యాదంపతులకుఁ బట్టభద్రుని జేసినంత సంతసము గలినది. పండితభట్టు కుమారు నుపవీతుని జేసియు మశీదునకుఁ బంపుటమానలేదు, యవనవిద్యయే చెప్పించుచుండెను. పిన్నఫకీరున కిష్టము వచ్చినప్పుడు వేదము చెప్పుటకుగాను నింటియొద్ద నొక యుపాధ్యాయుని నియమించెను. దానంజేసి పిన్నఫకీరు క్రీడాలాపంబులంబోలె వేదవాక్యంబుల నశ్రమముగా నేర్చుకొనియెను.

మఱియుఁ బిన్నఫకీరు యవనసాహవాసమువలన గుఱ్ఱమెక్కుటయుఁ గత్తి త్రిప్పుటయు సాముజేయుటయు వేడుకపడి తండ్రిం గోరుకొనినఁ బండితభట్టు అట్టి వాండ్రం బిలిపించి యావిద్యలన్నియుఁ గుమారునికి నేర్పించుచుండెను. పిన్నఫకీరు గురువులనుండి యేవిద్యనైనను దర్పణము ప్రతింబమువలె నశ్రమముగా నాకర్షించుచుండును. ఆ బాలుండు రాత్రులయందు వేదశాస్త్రపరిశ్రమయుఁ బగలెల్ల నాయుధ పరిశ్రమయు నప్పుడప్పడు యవనవిద్యా ప్రసక్తియుఁ జేయుచుండుటచే బదియాఱేడుల ప్రాయమువచ్చువరకు నన్నిటియందును వానికసమానపాండిత్యము కుదిరినది.

ఆ విప్రకుమారుంజూచి రూపంబు మెచ్చువారు సహదేవుండనియు నస్వయానపాటవముఁ జూచువారు నకులుండేయనియు సాయుధ సాధనము విమర్శించువా రర్జునుండేయనియు మల్లసంగర నైపుణ్యముఁ దిలకించువారు భీముండనియు నిరుపమవిద్యాకౌశల్యముగనువారు ధర్మజుండనియు స్తోత్రములు చేయుచుందురు. అతనికి ఫకీరు పేర స్వర్దకముగా లేదని కాశీపురములో మహావీరుండని శూరులును పండిత రాయవల సూరులును బిలువదొడంగిరి. దానంజేసి యతండు మహా వీరుండనియుఁ బండితరాయలనియుఁ బిలువ బడుచుండెను. తల్లి దండ్రులు మాత్రము పిన్నఫకీరనియే పిలుచుచుండిరి.

ఆ వీరుండు తఱుచు తురకదుస్తులు ధరించుచుండును. గావున యవనప్రభు రీతి నొప్పుచుండును. పండితభట్టు వానికి వివాహము చేయువలయునని ప్రయత్నించెను. గాని వీరరసమునందుఁ యభిలాష శృంగారరసమునందుఁ గలుగక పోవుటచే నందుల కక్కుమారుఁడు సమ్మతింపడయ్యెను. ఒకనాఁ డమ్మహావీరుండు మశీదులోఁ గూర్చుండి యవనమతమునకును హిందూమతమునకునుంగల తారతమ్యంబుల గుఱించి చక్కఁగా నుపన్యసించి యందుఁగల పెద్దఫకీరు వాని యవనవిద్యాపాండిత్యమున కచ్చెరువందుచు అప్పా! నీపాండిత్యము నీవీరత్వము నీగాంభీర్యము ననన్యసామాన్యములు గాకున్న యవి. నీ విందుండదగిన వాడఁవు కావు డిల్లీకిఁబొమ్ము. పాదుషాగారు నిన్ను జూచెనేని నల్లునికిజేయునంత గౌరవముఁ జేయుదురు. మా మశీదున కాయన ప్రతిసంవత్సరము వార్షికము పంపుచుండును. ఆసొమ్ము రేపో నేఁడో రాఁగలదు. ఆ విత్తముఁ దెచ్చిన భటులవెంట నరుగుము. నీకుత్తరము