పుట:కాశీమజిలీకథలు -02.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీకథలు - రెండవభాగము

గలను. ఆ వృక్షములపైన బ్రచ్చన్నముగా నుండి దివిజులు పాడుచున్నారని యూహించితిని. నిముషమున కొకరీతిగా నాగీతము వినంబడును. నేను బెద్దతడవందు నిలబడి వింటిని. ఎంతసేపున్నను నచ్చటనే వినబడినది. ఆ గానము వినుటచే మనస్సంతయు నీరైపోయినది. మనము కొన్నిదినము లిందుండి యా గానము వినుచు సంతోషముగా గాలక్షేపము చేసికొందము అయ్యా! ముందుగా నావృత్తాంతమెట్టిదో చెప్పుడు. తరువాత జపము చేసికొనవచ్చును. దానివిధము వినినదాక తోచుటలేదు. అని మిక్కిలి వినయపూర్వకముగా బ్రార్ధించెను.

జపవిఘ్నము చేసినందులకు మొదట వానిపై నెంతేని గోపము వచ్చినది కాని వాని దీనాలాపములచే దుదకదియంతయుం బోయి మణిసిద్ధుడు పక్కున నవ్వుచు నోరీ! నీతో మిగుల జిక్కుగానున్నది. సమయము తెలిసికొనక యడుగుచుందువు. ఏమి మించిపోయినది. మరికొంతసేపుండి అడుగరాదా! యెన్ని సారులు చెప్పినను నీ తొందర విడువవు. నే నెచ్చటికేనిం బోయెదనా! భోజనమైన వెనుక సావధానముగా గూర్చుండి చెప్పుకొనిన జక్కగా నుండునుగద కానిమ్ము ఇక ముందెన్నడు నిట్లు జపవిఘ్నము చేయకుమని పలుకుచు నమ్మణివిశేషముచేత దద్వృత్తాంతమంతయు గరతలామలకము భంగి దెలిసికొని సంతసించుచు వానికా వృత్తాంతమిట్లని చెప్పం దొడంగెను.

రుచికుని కథ

తొల్లి జగన్నాథంబున బలదేవుండను మాలికుడు గలడు అతడు నిత్యము రమ్యముగా బుష్పమాలికలగట్టి యమ్ముకొనుచు జీవనము చేయుచుండెను. బలదేవుడు ప్రతిదినము రెండు పూటల యందు దప్పక జగన్నాధస్వామి యాలయమునకు బోయి మంచి మంచి దండలర్పించి స్వామి నర్చించి యింటికి వచ్చుచుండును. దానం జేసి వానికి హరిదాసని నామాంతరము గలిగియున్నది దైవమునందు వానికిగల భక్తి విశ్వాసములు వాని సాధుజీవనము జూచి ప్రజలు వానిని మహర్షితుల్యునిగా భావించు చుందురు.

ఒకనాడు కళింగదేశాధీశ్వరుండు సకుటుంబముగా యాత్రకు వచ్చి జగన్నాధస్వామి నర్చించి యేగెను. బలదేవుండు నాలుగేడులు ప్రాయము గలిగి ముద్దులమూట గట్టుచున్న యా భూపాలుని కుమారుని దాది యెత్తుకొనగా జూచి యుత్సకము జెందుచు దనకట్టి నందను గలుగ జేయుమని నిత్యము హరిభజనావసరములయందు నాస్వామిని బ్రార్ధింపుచుండెను. అట్లు కొన్ని దినములు గడిచినంత జగ