పుట:కాశీమజిలీకథలు -02.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీకథలు - రెండవభాగము

సుమీ. పాండురాజు వృత్తాంత మెరుంగుదువా? ఇదియే మనస్సులో దృఢముగా జ్ఞాపక ముంచుకొనుము. సంవత్సరము దాటిన వెనుక మనయిష్టమువచ్చినట్లు క్రీడింపవచ్చు. నీ సంగతి రహస్యముగా నుంచుమని చెప్పి నాచతురతచే నాయువతి నొప్పించి సంతసము గలగజేసితిని.

అంత శీఘ్రకాలములో చండవర్మ స్వర్గస్తుడైనంత యమాత్యులు నన్ను రాజుగాజేసిరి. నేను సింహాసన మెక్కి నతోడనే నీయూర శక్తిపూజ మూలమున జరుగుచున్న జీవహింసల తెఱగంతయు విని యిట్టిపనులు చేసినచో శిక్షింతునని యాజ్ఞాపత్రికల పంపుటయే కాక రాజభటులను బురంబంతయు నెల కొకసారి పరీక్షించి బలిపురుషుల నరయునట్లు నియమించితిని మరియు వీరి మంత్రశాస్త్రపుస్తకము లన్నియు లాగికొనున ట్లాజ్ఞాపించితిని. మొన్నటినెల పరీక్షలో నీపుస్తకము తెచ్చి నాకిచ్చిరి. దానిం జూచి కాదే గురుతుబట్టి యోయింటికి వచ్చితిని ఇదియే నావృత్తాంతము దైవకృపచే నేటికి మనమందరము సుఖముగా నొకస్థలమునకు జేరితిమి. ఇదంతయు భగవతియగు విశాలాక్షి కృపగాని వేరొకటికాదు. అని తన వృత్తాంతమంతయుం జెప్పి యాఫలపుష్పములం దెచ్చి వారికి జూపినది.

వానింజూచి యారాజును మదనుడును మిగుల వెఱగుపడిరి. పిమ్మట నక్కాంత వసంతతిలకను రప్పించి యావృత్తాంత మంతయుం జెప్పి మనమనోహరుం డీతడే యని మదనుని జూపిన జూచి యాచిన్నది మిగుల సంతసించినది. పిమ్మట నావిశాలాక్షి యాఫలమహిమ యంతయు నెరింగినది గావున నమ్మహారాజుతో దేవా ! ఈఫలము నాకు విశాలాక్షి మహాదేవి పసాదపూర్వకముగా నిచ్చినది. దీనిని భక్షించిన వారికి క్షుత్పిపాసలు గలుగవు. స్వప్నమందు దినిన నాకు సైత మవి యిప్పటికి గలుగలేదుగదా! ఎందరిచేత చిక్కి నను చివరకీ ఫలము విశాలాక్షి కృపచే మనయొద్దకే వచ్చినదని పలుకుచు దానినిగోసి నాలుగు ఖండములు చేసి యింద్రద్యుమ్నునికి అతనిభార్యకును మదనునకు వసంతతిలకకును సమానముగా బంచి యిచ్చినది.

ఆ ఖండముల దినినంత వారికి క్షుత్పిపాసలు హరించినవి. అందరును దాని యాశ్చర్యకరమైన మహిమను గురించి యూరక స్తుతిపాఠములు చేయదొడంగిరి. అంతట నింద్రద్యుమ్నుడు విశాలాక్షినిం జూచి అమ్మా! మేము మాదేశము విడిచి వచ్చి పెద్దకాలమైనది. నాకుమారుడు విజయుడు మా జాడ దెలియక చింతింపు చుండును. ఇచ్చటనుండి మాదేశమునకు నోడమీదబోయిన వేగిరముగా జేరుదుము యోడ సిద్ధపరచి మాదేశమునకు మమ్ము బంపుప్రయత్నము చేయుము ఇప్పటికి మనమందరము కృతకృత్యులమైతి మని పలికిన నక్కలికి యిట్లనియె.

ఇచ్చట మదనునికి పట్టాభిషేకము చేయించి పిమ్మట మనమందరము కాశీపురమునకుబోయి యందున్న శత్రువుల బారదోలిపదపడి మీదేశమునకు బోవలయునని నాకభిలాషగానున్నది. దీనికి మీ అనుమతి యెట్టిదని అడిగిన అప్పడతి కతం డెట్ల