పుట:కాశీమజిలీకథలు -02.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

కాశీమజిలీకథలు - రెండవభాగము

గడిపెను. మరునాడు రాజులనందరం బిలచి సభఁజేసి యిప్పుడు మేము చోళదేశ ప్రభువైన వసురక్షతుని మీఁదికి యుద్ధమునకుఁ బోవుచుంటిమి. కావున మాకు సహాయ మెవ్వరు వత్తురని అడుగఁగా నందరును ముందే ప్రయాణమైరి. ఆతఁడు దుర్మార్గుఁడనియుఁ గపటోపాయములచే శత్రువుల వంచించెననియు నందరు నెరుంగుదురు. కావున నతనిపై దండయాత్రకుఁ బోవుటకు రాజులందరును మిక్కిలి సంతోషించిరి పిమ్మట మంచి సమయమునఁ జతురంగబలములతో నదృష్టదీపుఁడు చక్రవర్తులందరు సేవింప దాడివెడలి యా దేశమునకుఁబోయి పట్టణము ముట్టడించెను.

వసురక్షితుఁడా వార్త చారుల వలన విని యదృష్టదీపుఁడు ధర్మపాలుని కుమారుఁడగుటచే నతినిం జయించుట గష్టమనియు సంధి కొడఁబడ డనియు నిశ్చయించి పారిపోవఁ బ్రయత్నించెను. కాని యా రహస్యము దెలిసికొని యదృష్టదీపుఁ డతనిఁ బట్టుకొని తండ్రి యంఘ్రులం దగిలించియున్న సంకెళ్ళు విప్పించి అతని పాదములం గట్టించెను. ఆహా! కుమారుండన నతండే కదా! చింతాకులస్వాంతుఁడై యున్న ధర్మపాలుని యొద్దకు బోయి పుత్రకులిద్దరును పాదంబులఁబడి తమ వృత్తాంత మంతయు జెప్పి అతని కానందము గలుగఁజేసిరి

ధర్మపాలుఁడును పుత్రుల గారవింపుచుఁ దన యదృష్టమును గురించి భగవంతుని స్తుతిఁజేసెను. పిమ్మట నదృష్టదీపుఁడు దుర్వినీతుడును విహారభద్రుఁడు దెచ్చెటనున్నారని విమర్శింపగాఁ దమ రాజధాని యైన కౌశింబి యేలుచున్నారని తెలిసినది. అప్పుడు మిక్కిలి కోపముతో దండు లేవనెత్తి కతిపయప్రయాణములఁ గౌశాంబికిఁ బోయి వారినిద్దరిని బట్టుకొని కారాగృహమునం బెట్టించి సుముహుర్తమునఁ దమ కోటలోఁ బ్రవేశించి పట్టాభిషిక్తుడై సమస్తభూపతులకు వెలలేని రత్నములు గానుకల నిచ్చి నిజనివాసముల కనిపెను. మరియు నతండు వినయకేతుని వెదుకఁబంపి అతనిని రప్పించి అతని బుద్ధికిని సుగుణములకు మెచ్చుకొనుచు మరల నతనికి ప్రధానోద్యోగ మిప్పించెను.

దుర్జనుల రక్షించుట లోకమున కపకారమని తలంచి యాకోటద్వారమందు మంటపము గట్టించి దానిమీదఁ నడ్డముగా దూలములు వైచి విహారభద్రుని దుర్వినీతుని గొలసులచేఁ దలక్రిందుగా వ్రేలఁగట్టించి చిత్రవధ చేయించెను.

మరియు వారి శరీరముల మేదోమాంసముల నెండగట్టించి యెద్దియో యోషధి రాచి చిరకాలము దుర్జనులకు బుద్ధి వచ్చునట్లట్లనే యుండ నియమించిరి.