పుట:కాశీమజిలీకథలు -02.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఇప్పుడు నీవే యీ ప్రసంగము దెచ్చితివి కావున దెగువబూని యడుగుచున్నదాన దప్పైన సైరింపుమీ? నీవిట్టి వ్రతమేటికి బూనితివి? ఇది స్వకల్పితమా? పితృనిర్దిష్టమా? ప్రాణతుల్యనగు నాకు జెప్పినం దప్పులేదుగదా? యని గ్రుచ్చి గ్రుచ్చి యడిగిన నమ్మించుబోడి యించుక ధ్యానించి యల్లన నిట్లనియె ప్రియసఖీ! స్త్రీలయొద్ద రహస్యము నిలువదని యూహించి నీతో నింతకుముందు జెప్పలేదుకాని లేకున్న నీయెడ రహస్యము లున్నవియా? మా కులదేవత భువనేశ్వరీదేవియట. నేను భువనేశ్వరీదేవి వరంబున బుట్టితిని. బాల్యము నుండియు మాతండ్రి నన్ను గారాబముగాజూచి పెంచు చుండెను. అతనికి నేనొక్కతెనే పుత్రికనగుట సంతతము సన్నే జూచుకొని యానందించుచుండెను.

ఇట్లుండ నొకనాడు త్రికాలవేదియగు నొక యోగి మాయింటి కతిధిగా వచ్చెను. మా తండ్రి యయ్యోగీంద్రుని నుచితసత్కారములచే నర్చించి యతని స్యాంతమునకు మెప్పువచ్చునట్లు పచారములు బెక్కుగావించెను అమ్మహానుభావుడు మజ్జనకుని భయభక్తి వినయ విశ్వాసములకు సంతసించుచు గొన్నిదినము లందుండెను. అప్పుడు మా తండ్రి యాయనకు శుశ్రూషకుగాను నన్ను నియోగించెను. నేనును నతని చిత్తానువృత్తి మెలంగుటంజేసి యయ్యతికి నాయందు మిక్కిలి వాత్సల్మము గలిగినది. మరియు నతండు వెళ్ళబోవు సమయమున మా తండ్రి నన్నుజూపుచు, మహాత్మా! మీ శిష్యురాలికి దగిన వరుండు లభించునా? యని యడిగెను.

అతండు నవ్వుచు నన్ను జూచి బాలా! నీకు బెండ్లి యాడవలయునని యభిలాషయున్నదా? యని యడుగగా నేను నెఱిగియు నెరుగని ప్రాయంబున నుండుట బట్టి యించుకి సిగ్గుతొ దలవంచుకొనుచు మీయనుగ్రహంబుండిన బెండ్లి యాడెదనని చెప్పితిని. నా ముద్దుపలుకుల కతం డలరుచు నెద్దియో ధ్యానించి మన మిచ్చుచున్న ప్రశ్నము వ్రాసియిచ్చి పట్టీ! వీనికి సదుత్తరములిచ్చు వానింగాని బెండ్లి యాడకుము. ప్రతీశుక్రవారము భువనేశ్వరీదేవి నర్చించుచు సాయంకాలమున నీ యూరి కుత్తరము దెసనున్న శైలశిఖరమున కరుగుచు నచ్చట కొంతసేపు క్రీడించి వచ్చుచుండుము. సార్వభౌముడుగాని యీప్రశ్నముల కుత్తరము జెప్పలేడు దానంజేసి నీ కనుకూలుడగు వరుండు లభించునని పలుకగా విని మాతండ్రి అయ్యా! ఎప్పటికేని నట్టివాడు దొరకునా యని యడుగగా నతడు నవ్వుచు వానికేమి యుత్తరము జెప్పక నా చెవిలో నెద్దియో చెప్పి నన్ను దీవించుచు నెక్కడికేని బోయెను అప్పుడు మాతండ్రి నన్ను నీ చెవిలో జెప్పిన సంగతులేమియని యడుగగా వాటిని జెప్పుటకు గురువు నాజ్ఞ లేదని చెప్పితిని. దానిఁబట్టి యతడూహించుకొని సంతసించుచు నట్టి ప్రకటన దేశమంతయు వ్యాపింప జేసెను. ఇదియే దీని వృత్తాంతము. అమ్మహానుభావుని వచనం బమోఘంబని యాశతో నుంటిని. నేటివరకు నెవ్వడును చెప్పినవాడు లేడు.