పుట:కాశీమజిలీకథలు -02.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

కాశీమజిలీకథలు - రెండవభాగము

చూడ వింతగానున్నవి. ఇంతకుబూర్వమే మొదటవచ్చినకాంత మాకు జీటీచూపించి వెడలినది ఈరాత్రియొకతె లోనికిబోయినది. ఇరువురువచ్చిన బోనిత్తుమా! నీవు మమ్ము గ్రొత్తవారము గదాయని మాయజేసి పోవలయుననుకొంటివి. నీ విషయమై యనుమానముగానున్నది. ఉదయమువరకు గదలనీయమని రూఢముగా జెప్పిరి.

అప్పు డది కోపించుచు మీరు బుద్దిహీనులవలె దోచుచున్నారు. నేనెవ్వతె ననుకొంటిరి! ఇప్పుడు క్షణమాలస్యమైనచో రాజపుత్రిక జీవింపదు. ఈ యపరాధము మీమీదబడును. మీ కనుమానమున్నచో నా వెంటరండు. మీ సందియము దీరుతునని పలుకగా వారు సందియమందుచున్నంతలో మరికొందరు రాజకింకరులు వడిగావచ్చి చతురికా! చతురికా! యని పిలువదొడఁగిరి. అప్పుడప్పడతి యాధ్వని విని ఓ! యని పలుకుచు నయ్యో నేనేమి చేయుదును? వీరు నన్ను రానియ్యకున్న వారు. వేరు త్రవ్వుకొని వచ్చితినని చెప్పగా నా కింకరులు ద్వారరక్షకుల మందలింపుచు అయ్యో! దీని నాపుచున్నా రేమి? దీని రాకకై రాజుగారు వేచియున్నారు. ఈ మాట తెలిసినచో మిమ్ము శిక్షించును. రాజపుత్రిక చావుబ్రతుకులమీద నున్నది. ఆమెకొరకు నోషధి దెచ్చుటకు నీమచ్చకంటి యిచ్చటికి వచ్చినది. ఇది కాంతిమతికి మిత్రురాలు. దీని మీ రాటంకము చేయుచున్నారేమి యని యాక్షేపింపగా వారేమియు బలుకలేక మొదట పోయినదే తమ్ము మాయజేసినదని నిశ్చయించుకొని యారహస్య మెవ్వరికి జెప్పక యప్పుడప్పడతిం బోనిచ్చిరి.

పిమ్మట నా కొమ్మయు సమ్మోదముతో బోయి యావేరుదెచ్చిన వార్త యెల్లరకు దెల్లముచేసి యది యరుగదీసి యాగంధము గాటువైచినచోట నంటించుచు దాని చెవులో నూదుదానివలె నీ మనోహరుడు సుఖముగా దోటదాటిపోయెను. నీవింక స్మృతి దెచ్చుకొమ్మని చెప్పినది. అమృతప్రాయమైన యామాట వినినతోడనే యా చేడియ ప్రాణములు గూడికొనినట్ల నభినయించుచు మెల్లమెల్లగా గన్నులుదెరచి చూచుచు దనకు గొంచెము నింపాదిగా నున్నదని సంజ్ఞాపూర్వకముగా జెప్పినది.

అప్పుడందరు చతురిక వైద్యమును గురించి పెక్కు తెఱంగుల స్తుతి సేయదొడంగిరి. తరువాత జతురిక కాంతిమతికి విషము విరిగి రోగము తిరిగినదనియు మాటలాడక నిద్రబోనీయుడనియు నందరితో జెప్పి యట్లు నిద్రబొమ్మని చెప్పినది. కాంతిమతియు సుఖముగా నిద్రబోయి యుదయమున లేచినది. అనంతవర్మ ప్రొద్దున్న లేచి యా యుద్యానవనమునకు బోయి యత్తోటలో నలుమూలలు మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా వెదకించెనుగాని యందు నెవ్వరు గనంబడలేదు. ద్వారపాలుర బరీక్షించి యడిగెను. వారు రాత్రి జరిగిన మోసము జెప్పినచో దమ్ము శిక్షించునను వెఱపున నేమియుం జెప్పిరికారు. అప్పుడు రాజు తన శత్రువు లెవ్వరో యట్టి యుత్తరము వ్రాసినారని నిశ్చయించుకొని పుత్రికయందుగల కోపమంతయు బోగొట్టుకొని యక్కాంతామణి నెంతేని సంతోషముతో మన్నించుచుండెను,