పుట:కాశీమజిలీకథలు -02.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

185

కాంతిమతియు నడుమనడుమ బెడదచూపులచే నతని సోయగము చూచుచు అయ్యో! లాగకుము. తాళుము, తాళుము. నీ సొమ్మిచ్చెదనులే. అని పలుకుచు బలాత్కారము సేయుదానివలె నభినయించుచు నెట్టకేలకు నారాజకుమారుని యొద్దకు బోయి నిలిచినది. అతండును విలాసదృష్టుల దానిం జూచుచు చతురికా! తొందరపడియెదవేల నూరకొనుము. పరీక్షకులే వచ్చి చూతురు. అని పలుకుచు దనయొద్దనున్న తన చిత్రపట మాచతురిక చేతి కందిచ్చుచు గాంతిమతి పటమును దాను గైకొని తత్తారతమ్య మరయుచుండెను. కాంతమతియు నతని ప్రతిబింబమును జూచిచూచి విస్మయముజెంది మరల నతని మొగముజూచుచు మొగమున శృంగారచేష్ట లభినయించుచు దరువాత నా వ్రాత జూచి మొగము ద్రిప్పుచు నీరీతి గొంతసేపు మఱియొక మిషచే మనంబునం బుట్టిన యభిలాష లడచికొని వింతనగవుతో జతురికా! నీవు గెలిచితివి. నీకియ్యకొన్న విత్త మిచ్చివేసెదను. అని పలికి మరల నొకమారతని మొగమున దృష్టి నెరయ జేసినది.

పిమ్మట నదృష్టదీపుడును దానింజూచి చతురికా! నీవు నాకు జూపినపటము తథ్యమైనదని యిప్పుడు నమ్మితిని. నీవు సత్యవచన వగుదువని పలికి యూరకుండెను. అప్పుడొక నిముష మా మువ్వురు చిత్రప్రతిమలవలె జలింపక నిశ్శబ్దముగా నుండిరి. తరువాత నా చతురిక వారి చిత్రఫలకములు రెండును సమముగా బట్టుకొని అదృష్టదీపునితో నయ్యా! యీ రెంటిలో నేది చక్కదనముగా నున్నదియో నాకు దెలియకున్నది. మీరు బుద్ధిమంతులు నిరూపించి చెప్పుడని అడిగిన నతండొకింత నవ్వుచు నోహో! నన్నిట్లడుగ నేల? స్త్రీ పురుష భేదముగల యీరెంటికిని సామ్య మెప్పుడును గలిగియుండదు. దేని కదియే చక్కగా నున్నదని పలికెను.

పిమ్మట నాకొమ్మ కాంతిమతి దగ్గరబట్టి అడుగగా నప్పుడదియు సిగ్గు పెంపున నేమియుం బలుకనేరక సన్నని యెలుంగున బోఁటీ! నీవు పన్నిదము గెలిచితివికాని చిత్రఫలకమును నార్యపుత్రునికి సరిగా వ్రాయలేకపోయితివి. ఇదియే నీ యందుగల న్యూనత. ఈ రెంటికి దారతమ్యములు చిత్తానుగుణ్యములై నున్నవి. అది పరమేశ్వరునికి గాక యొరులకు జెప్పక శక్యమా? అని తెలిసియు దెలియనట్లు పలికినది. అంత నా రాజనందనుడు చతురికం జూచి యింతీ! నేను వచ్చి తడవైనది. నీవు మిక్కిలి ప్రార్థింప నింతదూరము వచ్చితిని నాకొరకు నామిత్రుడు బలభద్రుడు వెదకుచుండును. ఇక బోవచ్చునాయని యడుగగా నది మందహాసముసేయుచు ఆర్యా! నీవు నా కార్యము చక్కజేసితివి. నీవృత్తాంతము సమగ్రముగా విని నీకెద్దియేని నా యోపిన యుపకారము సేయదలచికొంటిని. నీ పేరేమి? నీవేరాజు కుమారుడవు? ప్రచ్ఛన్నముగా నీయూర విహరించుటకు గారణమేది? నీదేదేశమని నడుగగా నతడిట్లనియె. మేమెప్పుడు