పుట:కాశీమజిలీకథలు -02.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

కాశీమజిలీకథలు - రెండవభాగము

లెక్కింప శక్యమా? మొన్ననొక బ్రాహ్మణుడు నూరేనుగులతో బోవుచు దారిలో నొకచోట నాకు గనంబడెను అతని శుద్ధదరిద్రునిగా నంతకు బూర్వము నే నెఱుగుదును. కావున నీయేనుగు లెక్కడివని యడిగితిని. అప్పుడతండు నన్ను గురుతుపట్టి రామశాస్త్రిగారా! అయ్యో! ఎంత పొరబాటు చేసితిరండి! మీరుకూడ రామేశ్వరము వచ్చినచో నెంతో ద్రవ్యము దొరుకునుగదా? అదృష్ట దీపమహారాజుగారు పదిదినములక్రిందట ననేకకోట్ల ధనము పంచి పెట్టిరి. నేనంతయు నైన తరువాత బోయితినిగాని నీయేనుగులు మాత్రము దొరికినవి. మెదటనున్న బ్రాహ్మణులకు మితిలేని ద్రవ్యమిచ్చిరి. ఈలాగున జరుగునని యెవ్వరికిని దెలిసినదికాదు. లేనిచో నీ భూమిలో నున్న బ్రాహ్మణులందరు నచ్చటికి రాకపోవుదురా? ఆహాహా! అచ్చటికి వచ్చిన బ్రాహ్మణులందరు గుబేరులైరి. అమ్మహారాజు పుణ్యమేమని స్తుతియింపుచు నాయేనుగుల దోలుకొనిపోయెను. అట్టి పుణ్యాత్ముడిప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినట్లు ప్రతీతిగా నున్నది. అందువలన నేనును ప్రతి తీర్థమునకును బోవుచున్నాను.

వెంకట - దేనికైనను ప్రాప్తముండవలయునుగదా! నేను జిర కాలమునుండి యీ దరిద్రదేవతచే బాధింపబడుచున్నాను. అయ్యయ్యో! రామేశ్వరమైన బోయితిని గానే? అట్టి బుద్ది నా కేలబుట్టును.

అని యిట్లు తన సంగతి వారిరువురు మాట్లాడుకొనుచుండగా విని యదృష్టదీపుడు సంతోషించుచు వారి కేమైన నీయదలంచుకొని నను తనయొద్ద నేమియు లేక పోవుటచే జింతింపుచు నా సత్రములోనే యొకచోట బసజేసియుండెను. మఱియు నా పట్టణములో దమవారి జాడ యేమైన దెలియనేమో యని కొన్ని దినములందుండి నిత్యము సాయంకాలమునందు బలభద్రునితో గూడ వీధులవెంబడి విహారార్థమై తిరుగుచుండెను.

ఇట్లు తిరుగు నొకనాడాయూరి దేవాలయములో సాముద్రిక శాస్త్రవేత్తయగు సన్యాసియుండుట విని యాయన యొద్దకు బోయి స్తుతివాక్యపురస్సరముగా నాశ్రయించి హస్తము చాపుచు రేఖలం జూపి తల్లిదండ్రుల విషయము సోదరభావమును గురించి ఫలము చెప్పుడని వేడుకొనియెను. అప్పుడా సన్యాసి యతని హస్తరేఖల జూచి విస్మయ మందుచు ఆహా! నా జన్మావధిలో నిటువంటి చేయి జూచియుండలేదు. సాముద్రికశాస్త్రములో జెప్పిన యుత్తమపురుషలక్షణము లన్నియు నీ యందు యున్నవి. నీవు సామాన్యవేషముతో నుండుటకు నాకు మిక్కిలి యాశ్చర్యముగానున్నది. అదృష్టదీపునికి వచ్చినంత ఖ్యాతి నీకు రావలసియున్నది. నీ తల్లిదండ్రు లిప్పుడు బ్రతికియున్నవారు. నీ కొకసోదరు డుండవలయు. బెక్కేల నీవొక్కడవే యీ భూమి యంతయు బాలింపదగి యున్నదని చెప్పెను.