పుట:కాశీమజిలీకథలు -02.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

143

డైనందెచ్చునా? నీవు నాకు బావకి బావ వగుదువు. మాయక్క నడిగితినని చెప్పుము. మరియొక రహస్యమున్నది. చెవిలో జెప్పవలయు నిటురమ్ము. ఎవరికిని జెప్పవుగదా? నాచేతిలో చేయివేయుమని పలకగా నందుడు నవ్వుచు మరదలా! అది యేమి రహస్యము చెప్పుమని పలుకుచు దిలోత్తమ యొద్దకుం బోయెను.

అదియు వాని గ్రమక్రమముగా దూరముగా దీసికొనిపోయినది. అది యంతయు నేను వివరములో నుండి చూచుచునేయుంటిని అతడు దూరముగా బోయిన వెంటనే బయలువెడలి యది చెప్పిన గోడ మాటున దాగితిని. వానిచెవిలో నేమి చెప్పినదో వాడు మిగుల సంతోషింపుచు వచ్చి యాగుమ్మమును మూసి యచ్చట గాపుండెను. తిలోత్తమయు నందా! ఈ గుమ్మమును భద్రముగా గాపాడుచుండవలయు జుమీ? యని పలుకుచు మెల్లన నాయొద్దకు వచ్చి నన్ను వెంటబెట్టుకొని రహస్యముగా దనయింటికి బోయినది.

ఆహా! అప్పుడుమాకు మృత్యుముఖమునుండి వెలువడినట్లుగా నున్నది. పిమ్మట నాకొమ్మ చెలికత్తియలంజేరి తాను వెళ్ళిన తరువాత నేమి జరిగినదని యడుగగా నిట్లనిరి. అమ్మా! నీవు పోయిన వెసుక మొదట జయంతుడు వర్తమాన మంపెను. తరువాత బృహస్పతి పంపున నిన్ను బిలుచుటకు రంభ వచ్చినది అప్పుడు మేము ఇంటిలో లేదనియు యెచ్చటికి బోయినదో మాకు దెలియదని చెప్పితిమి. తరువాత నింద్రుడు వార్త నంపెను. నీవిషయమై బృహస్పతివారు మిక్కిలి కోపముజేసి యింద్రునితో జెప్పిరట! ఇంతలో విరూపాక్షుని యల్లరి వచ్చుటచే నీ ప్రశంస యడుగునబడినది. ఇదియే యిచ్చటి వృత్తాంతమని చెప్పిన విని తిలోత్తమ భయపడుచు విచారముఖముతో నంతఃపురమునకు నన్ను దీసికొనిపోయినది.

ఇంతలో వీథిలో నెద్దియో చాటించుచుండిరి. ఆ వార్త తెలిసికొని వచ్చి పరిచారిక అమ్మా! విరూపాక్షుని గురించి చెప్పినవార్త యంతయు నసత్యమట. రేపు శ్రీపుష్పయోగోత్సవము జరిగింతుమనియు బురమార్గంబులన్నియు దీయబడుననియు యధేష్టముగా నెల్లరు విహరింపవచ్చుననియు జాటించుచున్న వారు అని చెప్పినది. ఆ మాట వినినతోడనే తిలోత్తమ రేపు అమ్మహోత్సవము జరిగిన నాటకమాడుదురు. న న్నడిగిరేని నెచ్చటికిబోయితివని బొంకుదును? ఏమి చేయుదునని యాలోచించుచు నా పజ్జంగూర్చుని యెద్దియో చెప్పబోవు సమయమున చెలికత్తె వచ్చి జయంతుడు వచ్చుచున్నాడని చెప్పినది.

ఆమాట వినినతోడనే యదరిపడి లేచి నన్నొక మూల దాచి యతని కెదురేగి యుచితమర్యాదల దోడితెచ్చి యాతల్పమున గూర్చుండబెట్టినది. అత డప్పుడు తిలోత్తమా ! ఇన్నా ళ్ళెచ్చటికి బోయితివి. పార్వతీపరిణయ నాటకములో నీవొక పాత్రను