పుట:కాశీమజిలీకథలు -02.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరగుప్తుని కథ

119

నర్ధాంగీకారముగాఁ దీసికొని రండని భటుల కానతిచ్చెను. రాజకింకరు లతని యానతి చొప్పున వీరగుప్తుని రాజునొద్దకుఁ దీసికొనిపోయిరి.

రాజు వీరగుప్తుని ముఖవిలాసము నేత్రసౌష్టవంబు మొదలగు లక్షణంబులు పరికించి యోహా! ఈతండు మంత్రియధికారంబు కాదు. రాజ్యాధికారంబునకు సైతము తగియున్నవాఁడు వీనినొక్క ప్రశ్నయే యడిగెదను. దానికుత్తరం బిచ్చెనేని తప్పక మంత్రిగాఁ జేసికొనియెదనని తలంచుకొని యతనిమిగుల మన్నించి కూర్చున్న వెనుక, అయ్యా! పండ్రెండింటిలో నాలుగు తీసివేసిన నెంతయని యడిగెను. వీరగుప్తుఁడు ఆలోచింపకయే సున్నయని యుత్తరముచెప్పెను. ఆమాటలు వినిన సభ్యు లెల్లరు పెదవులు విరుచుచు అయ్యో! లెక్కయే రానివానికి మారాజు మంత్రిత్వ మెట్లిచ్చును. మనమేదియో నడుగునని కొంటిమి. ఈమాత్రపుప్రశ్న మనలనుఁ జేసినచో మంత్రిత్వంబు మనకేవచ్చునే! రాజులు వెర్రివాండ్రు వారేమన్న నది గొప్పప్రశ్న యగును. పాపమీ చిన్నవాఁడు దానికే యుత్తరము చెప్పక సున్నయనెను. యెనిమిదని చెప్పినచో మంత్రిత్వంబు వచ్చును గదాయని యనేక ప్రకారంబులు జెప్పుకొనఁ దొడంగిరి.

అప్పుడు ధర్మాంగదుఁడు వీరగుప్తుని గౌరవించుచు అన్నా! నేఁటికి నాకు దగిన మంత్రివి దొరకితివి. నీపాటి బుద్ధిమంతు దింతకుమున్ను నాయొద్దకు రాలేదు. నే డెంత సుదినమోకదా ఇదిగో? యిప్పుడీ మంత్రిత్వముద్రికలిచ్చువాడ. నీవే నా మంత్రివని ముమ్మారు పలికి యాముద్రికలం దెప్పించి అతనికిచ్చెను. ఆ యర్ధము వారిరువురకే గాక అచ్చటనున్న వారెవ్వరు గ్రహింపలేక రాజును వట్టి మూర్ఖుడని నిందింప దొడంగిరి. మరికొందరు సాహసముతో రాజుగారింజూచి అయ్యా! తామింతకు మున్ను పెక్కండ్రకు జిక్కు ప్రశ్నలిచ్చి వారెద్ది చెప్పినను సమ్మతింపక యూరకపొమ్మంటిరి. ఇప్పు డితనిని సుఖమయిన ప్రశ్న అడిగిరి. అతడు చెప్పకున్నసు ప్రధానిగాఁ జేసికొంటిరి. పండ్రెండింటిలో నాలుగుపోయిన సున్న యెట్లగును యెనిమిదికాదా? ఈ సందియము మమ్మందర బాధించుచన్నది. కారణమెద్దియో చెప్పుడనుటయు ధర్మాంగదుడు నవ్వుచు వారికిట్లనియె.

ఓ మందలార? నే నిందులకే యెవ్వరిని నొప్పుకొంటిని కాను వినుఁడు. పండ్రెండింటిలో నాలుగుపోయిన నెనిమిదని యెల్లరకు దెలిసినదే. నాఅభిప్రాయము మాత్రమదికాదు. పండ్రెండనగా మాసములు పండ్రెండు మాసములలో నాలుగనగా వర్షకాలము నాలుగు మాసములు కనుక నాలుగుమాసములు తీసివేసినయెడల ననఁగా వర్షింపని యెడలనని అర్ధము. వర్షములు కురియనియెడల పంటలు పండవు గదా పండ్రెండుమాసములకు ముఖ్యమైనవి వర్షకాలము నాలుగుమాసములే. ఆ నాలుగుమాసములు పోయినవనఁగా వర్షము కురియక యూరకున్న నా సంవత్సరము సున్న కాక మఱేమియున్నది. అందువలననే పండ్రెండింటిలో నాలుగుతీసివేసిన సున్నయని