పుట:కాశీమజిలీకథలు -02.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కాశీమజిలీకథలు - రెండవభాగము

మంచమును భుజంబుల నానుకొని మెల్లగా వీథింబడి పోవం దొడంగిరి. ఆవీథియం దొకపెండ్లివారు మేళతాళంబులతో నూరేగుచుండఁగా నయ్యలజడిలోఁ దిలోత్తమ లేచునేమో యను భయముచే మరియొక వీథింబడి నడువసాగిరి. అందునను రాజభటులసమ్మర్దము గలుగుట వేరొకవీథిని బోఁదొడంగిరి. అచ్చటను ప్రజలు లేచితిరుగుచుండుటచే మరియొకమారుమూలవీథి నరిగిరి. ఈరీతి క్రమక్రమంబుగా నొకదెసలనుండి వేరొకదెసకుబోయిరి. వారికి నుద్యానవనంబునకుఁ బోవుట కెంతమాత్రము నవకాశము గలిగినదికాదు. అప్పుడు వాండ్రు ఇక మనము తోఁటలోనికి బోలేము. తెల్లవారు సమయమైనది. రాజభటులు మనలను జూచిరేని బట్టుకొందురు. బలసింహుని భయంబు మన కేటికి, దీనిమేనున మంచివిలువఁగల రత్నపు సొమ్ములు గలిగియున్నవి కావున దీనిం దీసికొని యడవిదారిం బడి బోవుదము అని యొండొరులు నిశ్చయించుకొని యా మంచంబుతో నొకమహారణ్యమార్గంబునంబడి పోయిరి.

అచ్చట నుద్యానవనంబులో నుదయంబునఁ జంద్రలేఖ లేచి తిలోత్తమను గానక పరితపించుచుఁ జెలికత్తియల నందఱం బిలిచి యా తోఁటయంతయు వెదకుచుండెను. ఇంతలోఁ గావలివారలు తోఁటగోడకు దొంగలు కన్నంబువైచిరని అఱచిరి. ఆమాటలు విని చంద్రలేఖ యురస్తాడనపూర్వకముగా దుఃఖింప దొడంగినది. ఇంతలో నా వృత్తాంతము విని భార్యామంత్రిబంధుపరివారసహితంబుగా మహీపతి అచ్చటికి వచ్చి పుత్రికారహితమగు నయ్యుద్యానవనంబు గాంచి మిక్కిలి దుఃఖంపఁదొడంగెను. పృథుకీర్తియను నతనిమంత్రియుఁ దిలోత్తమ నరయుటకై వడిగల వారువంబు నిచ్చి నలుమూలలకు రాజభటుల నంపెను. అట్టిసమయంబున బలసింహుడు చనుదెంచి చంద్రలేఖను సాధించుట కిదియే సమయమని తలంచి మోహో! మీరు వెఱవకుఁడు వెఱవకుఁడు. దీనిగుట్టంతయు నేను గ్రహించితిని. అని పలుకగా నచ్చటివారెల్ల విచారించుటమాని యతని మొగంబున జూడ్కులు బరగించిరి.

అప్పుడు పుడమిఱేఁడు శ్యాలకునిఁజూచి యోయీ! నీవేమెఱుంగుదువో చెప్పుమని అడుగఁగా నతండిట్లనియె. బావా! నేనేమని వక్కాణింతును. ఇట్టిపని చేసిన దొంగ యిచ్చటనేయున్నది. ఎచటనుండియును జోరులు రాలేదు. ఈకపటము మనము గ్రహింపలేకపోతిమి లంజపడుచుతో మన తిలోత్తమ సహవాసము సేయుచుండ నుపేక్షించి యూరకొనిన తప్పెవ్వరిది. ఆ లంజను నుంచుకొనినవాఁడు మన తిలోత్తమ విద్యారూపసంపత్తులు విని దానిం దీసికొనివత్తువేని నీకు మిక్కిలిరొక్క మిత్తునని చెప్పుటచే నీవేషము వేసికొని క్రమముగా దానితో మైత్రిఁ జేసి యుద్యానవనవిహారపుమిషచే యిల్లు గదలఁజేసి తుదకు దాని నంపివేసినది. ఇదంతయు నిక్కువంబు. ఈ సంగతి యొండు రెండుసారులు నా చెవింబడినది గాని మహారాజుగారే యుపేక్షింప నాకేమిటికని ప్రకటించితినికాను. ఇంతయేల యిందలి యథార్ధమంతయు మనయింట