పుట:కాశీమజిలీకథలు -01.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రాఁగలదని పెక్కు స్తోత్రపాఠములు పఠించిన మంత్రి మాటలను రాజు విని పరమానందభరితు డయ్యెను. వరప్రసాదులు నవ్వుకొని నామాటల ననువదించిరి. అప్పుడు రాజు వారితోఁ గోవిదులారా! మీ విద్యాపాటవం బెట్టిదో యెఱింగింపుఁడు. అపూర్వ మని తోచినచో మిమ్ము తప్పక భరింతునని పలుకుటయు మంత్రి పుత్రుండగు రాము డిట్లనియె.

అయ్యా! మే మాఱుమాసముల కొకదోవతులచాపు చీరయుఁ దలరుమాలును నేయుదుము. ఆ పుట్టములకు నేఁబదివేల మాడలు వ్యయమగును. అందు ముందుగా సగము సొ మ్మీయవలయును. బట్టలనేత ముగిసినతోడనే మే మెవ్వఱికి నేయుదుమో యా యజమానుఁడు భార్యతోఁ దనకుఁగల వైభవమున నొకసాయంకాలమం దూరేగి మా బసలోనికి వచ్చి మా కియ్యవలసిన సొమ్ముతో నోపినంత బహుమతిం గూడ నియ్యఁదగినది. పిమ్మట నాపుట్టముల మేమే వారికిఁ గట్టుదుము. ఆ పుట్టంబులం గట్టికొని యూరంతయు నూరేఁగి యా రాత్రి భార్యాభర్తలు కామకేళిం దేలినచోఁ దత్ప్రభావంబున వారి కధికతేజస్పమన్వితుండగు నందనుం డుదయించును. మఱియు నొకవిశేష మాకర్ణింపుడు. మేము నేయుబట్టలు గాని నూలు గాని జారత్వదోషమువలన జనించినవారికి మాత్రము గాన్పింపవు. అవి దేవతావస్త్రములు. ఇట్టి చాపుల నేఁటి కొకసారి నేసి మా రాజుగారివలన మిగుల గౌరవ మందుచుందుము. దైవప్రాతికూలమున నతండు చిక్కులంబడియుండుటం బట్టి యింతదూరము రావలసి వచ్చినది. ఆ పుట్టంబులఁ గట్టినప్పుడుగాని యయ్యానందము సెప్పినం దీరదు. ఇందుల కొడంబడుదురేని నిందుండెదము లేనిచో సెలవీయుఁడు. వేఱొక యాస్థానమున కరిగెద మనుటయు నపుత్రకుండును నూతనమార్గస్థాపకుండు నగుటచే దానఁ దనకు గొప్ప ఖ్యాతి రాగలదనియు నట్టి ప్రభావము లేకున్న నొకచాపునకు చీరకు నంతవెల యేల యడుగుదురనియు మనంబునఁ జింతించి వా రట్టి ప్రభావసంసన్ను లగుదురని నిశ్చయించి వారితో నిట్లనియె.

ఓ తంతువాయకులారా! మీ కావిషయమై వితర్క మేమిటికి! మా సంస్థానమునకు వచ్చిన విద్వాంసు లూరక చనుట వలదా? రాత్రింబవళ్ళ మార్చి మిగుల విఖ్యాతిఁ జెందుచున్న నాకుఁ గ్రొత్తపనులకునై యెంత సొమ్మైనను లక్ష్యమా? మీ యిష్టము వచ్చినంత సొమ్ము వ్యయపెట్టి యట్టి యద్భుతవస్త్రంబుల నేసియిండని యానతిచ్చి వారు కోరినంత ద్రవ్యం బిచ్చి సబహుమానముగా నెలవున కనిపెను.

వింతబట్టల నేయఁగల పట్టుసాలీలు వచ్చినారని గ్రామమంతయు వదంతియగుటచే నట్టి వసనంబులు చూచుటకు పౌరులకుఁగూడ మిగుల నాతురముగా నున్నది. వరప్రసాదులును నేతసాధనములగు వేమాదండములు రాట్నములు మగ్గములు కండె